విద్యుత్ ఇష్యూలో చేతులెత్తేశారు

Update: 2015-07-31 10:21 GMT
విభ‌జ‌న నేప‌థ్యంలో ఏదైనా స‌మ‌స్య ఎదురైతే.. వెంట‌నే కేంద్రం ద‌గ్గ‌ర‌కు వెళతామ‌ని చెప్ప‌టం క‌నిపిస్తుంది. కానీ.. కొన్ని విష‌యాల్లో కేంద్రం ఏమీ చేయ‌లేద‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంది.

ఇప్ప‌టికే ప‌లు పంచాయితీల విష‌యంలో తీర్పు చెప్ప‌లేక చేతులెత్తేసిన కేంద్రం.. తాజాగా మ‌రోసారి అదే ప‌ని చేసింది ఏపీ మూలాలు ఉన్న ఉద్యోగులు తెలంగాణ‌లో భారీగా ఉన్నారంటూ 1200 మందికి పైగా ఉద్యోగుల్ని ఒక్క జీవోతో తెలంగాణ స‌ర్కారు రిలీవ్ చేసేసింది. అంత‌మంది ఉద్యోగుల్ని తామేం చేసుకోగ‌ల‌మంటూ ఏపీ స‌ర్కారు అడ్డం తిరిగింది.

దీంతో.. ఉద్యోగులు ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితి. ఈ విష‌యంపై ఇప్ప‌టికే కోర్టుల వ‌ద్ద‌కు చేరుకుంది. అదే స‌మ‌యంలో ఏపీ స‌ర్కారు కేంద్రం దృష్టికి విష‌యాన్ని తీసుకెళ్లింది. ఈ మ‌ధ్య‌నే కేంద్ర హోంశాఖ స్పందించి.. వారిని వెంట‌నే తెలంగాణ స‌ర్కారు పోస్టింగ్ ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

కేంద్రం చెప్పిన వెంట‌నే వినేయ‌టానికి తెలంగాణ స‌ర్కారు అల్లాట‌ప్పా కాదు క‌దా. అస‌లు ఏ లెక్క‌న మాకీ విష‌యాలు చెబుతున్నారంటూ కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌టంతో శుక్ర‌వారం ఉద‌యం ఢిల్లీలో ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

దీనికి తెలంగాణ.. ఏపీ రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు హాజ‌ర‌య్యారు. మ‌రోవైపు కేంద్ర హోంశాఖ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. విద్యుత్ ఉద్యోగుల ఇష్యూ పై రెండు రాష్ట్రాల ఉన్న‌తాధికారులు త‌మ వాద‌న‌లు వినిపించారు. వీరి వాద‌న‌లు విన్న కేంద్ర‌హోంశాఖ అధికారులకు చుక్క‌లు క‌నిపించిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ ఇష్యూలో ఇన్ని పాయింట్లు ఉన్నాయా? అని ఆశ్చ‌ర్య‌పోయిన వారు.. కాసింత తేరుకొని.. ఈ విష‌యాన్ని తామేమీ చేయ‌లేమ‌ని.. కోర్టులోనే తేల్చుకోవాల‌ని చెప్పి చేతులు దులుపుకున్నారు. తాజా స‌మావేశంలో ఈ ఇష్యూ క్లోజ్ అవుతుంద‌ని భావించిన ఇరు రాష్ట్రాల అధికారులు.. కేంద్ర వైఖ‌రిని చూసి త‌ల‌లు ప‌ట్టుకునే ప‌రిస్థితి. దాయాదుల లెక్క‌లు తేల్చ‌టం అంతే అంత సింఫుల్ కాద‌న్న విష‌యం ఈసారికి కేంద్ర‌హోం శాఖ ఉన్న‌తాధికారుల‌కు అర్థ‌మై ఉంటుంది. అనుకుంటాం కానీ.. కేంద్రం.. కేంద్రం అంటాం కానీ.. దానికి సీన్ త‌క్కువేనా?
Tags:    

Similar News