ఈసారి మినీ జమిలి

Update: 2018-08-25 08:27 GMT
దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు - లోక్‌ సభకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్న చర్చ అంతటా సాగుతోంది. ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో జమిలి ఎన్నికలు నిర్వహించకపోయినా దాదాపుగా అదే స్థాయిలో మినీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌ సభ ఎన్నికలతో పాటు 9 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం.
   
మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - చత్తీస్‌ గఢ్ - మిజోరం అసెంబ్లీలతో పాటు లోక్‌ సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ వచ్చే సంవత్సరం మార్చి మధ్యలో ఏప్పుడైనా జరగవచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మిగతా అసెంబ్లీ - లోక్‌ సభ ఎన్నికలు ఫిబ్రవరి లేదా మార్చిలో జరగడానికే ఎక్కువ అవకాశాలున్నాయన్న కథనాలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలపై కూడా సమావేశాల తరువాత స్పష్టత రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం మేరకే 4 రాష్ట్రాల శాసన సభలతో పాటు లోక్‌ సభకు మినీ జమిలి ఎన్నికలు జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లపై బీజేపీ అధినాయకత్వం దృష్టి పెట్టిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కోరుతున్న విధంగా శాసన సభ ఎన్నికలను కూడా వీటితో నిర్వహించేందుకు హైకమాండ్ సుముఖంగా ఉందని సమాచారం.
   
అసెంబ్లీ - లోక్‌ సభ ఎన్నికలను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి - మార్చిలో నిర్వహించే పక్షంలో ఆంధ్రప్రదేశ్ - ఒడిశా - సిక్కిం - అరుణాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలను కూడా వీటితో కలుపుతారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గడువుకు ఆరు నెలల ముందే ఎన్నికలు జరిపే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది కాబట్టి, లోక్‌ సభ ఎన్నికలు ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే పక్షంలో ఏపీ - ఒడిశా - సిక్కిం - అరుణాచల్ ప్రదేశ్ శాసన సభల ఎన్నికలను కూడా ఒకటి రెండు నెలల ముందుకు జరిపే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
   
లోక్‌ సభతో పాటు మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - చత్తీస్‌ గఢ్ - మిజోరం - తెలంగాణ రాష్ట్రాల శాసన సభల ఎన్నికలను ఎప్పుడు జరపాలనేది వచ్చేనెల 8 - 9 తేదీల్లో ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయిస్తారని అంటున్నారు. కాగా బీజేపీ పాలిత మూడు రాష్ట్రాల్లో పార్టీ విజయావకాశాలపై అధినాయకత్వానికి అనుమానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - చత్తీస్‌ గఢ్ - రాష్ట్రాలకు డిసెంబర్‌ లో జరిగే ఎన్నికల్లో ఓటమి పాలైతే దాని ప్రభావం ఏప్రిల్ - మేలో జరుగాల్సి ఉన్న లోక్‌ సభ ఎన్నికలపై తీవ్రంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి లోక్‌ సభ ఎన్నికలను ఎదుర్కొనడం ఆత్మహత్యాస దృశ్యం కాబట్టి వీటిని విడివిడిగా జరపకపోవచ్చు.
   

Tags:    

Similar News