పవన్ సభ ముందు రోజు ‘ప్యాకేజీ’ ప్రకటన

Update: 2016-09-07 12:11 GMT
అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ చేస్తున్న పోరాటానికి ముగింపు పలికేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు రియాక్ట్ అయి.. హోదా బదులు హోదా ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ ఏపీకి కలిగేలా ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నది తెలిసిందే. వాస్తవానికి దీనికి సంబంధించిన ప్రకటన ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయానికి విడుదల చేయాల్సి వచ్చింది. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఏపీకి ఇవ్వాలని భావిస్తున్న ప్యాకేజీ వివరాల్నివెల్లడించాలని భావించినా.. తాము తీసుకున్న నిర్ణయానికి బాబు ఆమోద ముద్ర పడకపోతే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని చివరి నిమిషంలో గుర్తించిన కేంద్రం అందుకు తగిన ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో మునిగిపోయింది.

ఇందులో భాగంగానే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నుంచి ఏపీ ముఖ్యమంత్రికి ఫోన్ రావటం.. ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి.. మోడీ సర్కారులోని కీలక నేతలతో సమావేశం కానున్నారు. హోదా ఇవ్వకుండా ఆ స్థానంలో ప్యాకేజీ ఇవ్వాలన్న తమ ఆలోచనను బాబుకు వివరించటంతో పాటు.. ఆయన్ను సంతృప్తి పర్చాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన ప్రకటనను అయితే గురువారం కానీ.. తర్వాత కానీ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసే సభకు ముందు రోజు ప్యాకేజీ ప్రకటన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హోదా లాంటి ప్యాకేజీని ప్రకటించటం ద్వారా పవన్ కల్యాణ్ ఆగ్రహాన్ని చల్లారేలా చేయొచ్చన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. బీజేపీ అధినాయకత్వం అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే బాబు ఆమోదం తప్పనిసరి అవుతుంది. తాజాగా సిద్ధం చేసిన ప్యాకేజీ పట్ల చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేస్తే తప్పించి మోడీ సర్కారు ముందుకు వెళ్లలేదన్నది స్పష్టమని చెప్పక తప్పదు. ఒకవేళ బాబు కానీ ప్యాకేజీ పట్ల పెదవి విరిస్తే మాత్రం.. కాకినాడలో పవన్ చేత కమలనాథులకు మరో చాకిరేవు తప్పదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News