ఏపీ రాజ‌ధానిపై కేంద్రం త‌డ‌బాట్లు.. పొర‌పాట్లు!

Update: 2021-08-30 07:30 GMT
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అన్న విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రికీ తెలిసిందే. పోనీ.. సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు మూడు రాజ‌ధానులు అనుకున్నా.. ఇది ఇంకా న్యాయ ప‌రిధి దాటి బ‌య‌ట‌కు రాలేదు. దీనికి సంబంధించిన క్ర‌తువు కూడా పూర్తికాలేదు. అయితే.. ఏపీ రాజ‌ధానిపై కేంద్రం పిల్లి మొగ్గ‌లు వేస్తోం ది.  త‌డ‌వ‌కో ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కొన్ని సార్లు ఏపీకి మూడు రాజ‌ధానుల‌ని... మ‌రికొన్ని సార్లు.. ఇంకో ర‌కంగా ప్ర‌క‌టిస్తోంది. ఇప్పుడు తాజాగా విశాఖప‌ట్నాన్ని రాజ‌ధానిగా పేర్కొంది. దీంతో ఏపీ రాజ‌ధానిపై ఇప్ప‌టికే ర‌గులుతున్న సెగ‌.. మరింత రాజుకునేలా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

అస‌లు ఏం జ‌రిగింది?

దేశంలో పెట్రోల్, డీజి ల్ ధ‌ర‌లు రోజు రోజుకు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో విప‌క్షాలు కేంద్రంపై తీవ్ర‌విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అయితే.. ఇది త‌మ త‌ప్పు మాత్ర‌మే కాద‌ని.. రాష్ట్రాల పాపం కూడా ఉంద‌ని చెప్పేందుకు తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం వివిధ రాష్ట‌రాల్లోని రాజ‌ధాని ప్రాంతాల్లో పెట్రో ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నే విష‌యంపై ఒక జాబితా విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం.. పెట్రో పన్నులు ఎక్కడెక్కడ ఎంతెంత వసూలు చేస్తున్నారనేది చెబుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా వైజాగ్‌ పేరు ప్రస్తావించింది.

త‌ప్పు చేసి స‌రిదిద్దుకుని..

కేంద్ర ప్ర‌భుత్వం పెట్రో ధ‌ర‌ల.. విష‌యంలో ఏపీ రాజ‌ధానిని వైజాగ్గా పేర్కొన‌డంపై వివాదం ఏర్ప‌డ‌డంతో కేంద్రం వెంట‌నే త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేసింది.  వైజాగ్‌ అన్న దగ్గర కేపిటల్‌ సిటీ లేక రిఫరెన్స్‌ సిటీగా చదువుకోవాలని  ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఒక నోట్‌ విడుదల చేసింది. అయితే, గత నెల 26వ తేదీన సభలో అడిగిన 84వ నంబరు ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానానికి దాదాపు నెలరోజుల తర్వాత సవరణ చేయడం గమనార్హం.

గ‌తంలోనూ ఇంతే!

ఏపీ రాజ‌ధాని విష‌యంలో గ‌తంలోనూ కేంద్రం ఇలానే వ్య‌వ‌హ‌రించింది. కొద్ది నెలల క్రితం ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది?’ అంటూ సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన ఓ ప్రశ్నకు, కేంద్ర హోం అధికారులు వింత సమాధానమిచ్చారు. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారని సమాధానమిచ్చారు. గెజిట్‌లో అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయాన్ని, అక్కడ నిర్మాణాలకు స్వయంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అంశాన్ని, రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రానికి కొంత మేర నిధులిచ్చినట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని వారు  మరిచిపోయినట్లే వ్యవహరించారు. రెండో సారి మోదీ ప్రభుత్వం వచ్చీ రాగానే సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్‌లో అమరావతి లేకుండా ప్రచురించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ జోక్యం చేసుకోవడంతో మ్యాప్‌లో అమరావతిని తిరిగి చేర్చారు. ఇలా.. ఏపీ రాజ‌ధాని విష‌యంలో కేంద్రం పిల్లిమొగ్గ‌లు వేస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News