1500 మంది స్టూడెంట్లకు 600 మంది సైనికుల కాపలా

Update: 2016-04-09 07:44 GMT
తీవ్రవాదులు - ఉగ్రవాదుల వల్ల దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపలా కాసే, వారిని ఎదుర్కొనే కేంద్ర పారామిలటరీ బలగాలు ఇప్పుడు విద్యార్థులతో పోరాడాల్సి వస్తోంది. దేశంలోని యూనివర్సిటీలు రచ్చరచ్చగా మారిన నేపథ్యంలో పారామిలటరీ బలగాలు పెద్ద సంఖ్యలో యూనివర్సిటీల్లోనే కాపలా కాస్తున్నాయి.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ - ఢిల్లీ జేఎన్ యూల్లో గొడవలు ఒకెత్తయితే.. శ్రీనగర్ లోని  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐటీ)లో గొడవలు మరో ఎత్తు. అక్కడ టీ 20 క్రికెట్ మ్యాచ్ నేపథ్యంగా మొదలైన జాతీయవాద వివాదం స్థానిక - స్థానికేతర విద్యార్థుల మధ్య యుద్ధంగా మారిపోయింది. దీంతో ప్రస్తుతం శ్రీనగర్ యూనివర్సిటీలో ఉన్న 1500 మంది విద్యార్థులకు కాపలాగా కేంద్రంగా ఏకంగా 600 మంది పారామిలటరీ బలగాలను నియమించింది.

ఇటీవలి గొడవల అనంతరం వర్శిటీలో పరిస్థితులు మరింతగా చేయి దాటకుండా చూసేందుకు ఐదు కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. వర్శిటీలో 1500 మంది విద్యార్థులుండగా, 600 మంది పోలీసులు వారిని కాపలా కాస్తున్నారు. అంటే దాదాపు ప్రతి ఇద్దరు విద్యార్థులకూ ఓ సైనికుడు ఉన్నట్టు. వర్శిటీలో స్థానికేతర విద్యార్థులను స్థానిక పోలీసులు చితకబాదారన్న ఆరోపణలు వచ్చిన తరువాత, తొలుత రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ జవాన్లను పంపిన కేంద్రం, పరిస్థితి అదుపులోకి రాలేదని తెలుసుకున్న తరువాత, సహస్త్ర సీమా బల్ కు చెందిన మూడు దళాలను పంపింది. ఇండియాలో ఇలా జరగడం ఇదే తొలిసారని తెలుస్తోంది. ఒక వర్శిటీ భద్రతా బాధ్యతను పూర్తిగా పారామిలటరీ దళాలకు అప్పగించచడం ఇదే తొలిసారి.  స్టూడెంట్లు - పారా మిలటరీ ఫోర్సు లెక్క చూస్తే ప్రతి అయిదుగు స్టూడెంట్లకు ఇద్దరు  గన్ మెన్లను నియమించినట్లు లెక్క.
Tags:    

Similar News