కేసీఆర్ మాట‌!..ప‌త్రికా స్వేచ్ఛ‌ను కాపాడాల్సిందే!

Update: 2018-04-03 11:27 GMT
ప‌త్రికా స్వేచ్ఛ‌కు గొడ్డ‌లిపెట్టులాంటి నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర‌స‌న‌లు బ‌య‌ట‌కు పెద్ద‌గా క‌నిపించ‌కున్నా... అటు మీడియా సంస్థ‌లు - వాటి ఎడిట‌ర్లు - యాజ‌మాన్యాలు - ప్ర‌జా సంఘాలు - ప‌లు రాజ‌కీయ పార్టీల నుంచి వెల్లువెత్తిన నిర‌స‌న‌ల నేప‌థ్యంలో మోదీ స‌ర్కారు కేవ‌లం కొన్ని గంట‌ల్లోనే తాను తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకోక త‌ప్ప‌లేదన్న వాద‌న వినిపిస్తోంది. న‌కిలీ వార్త‌ల‌పై క‌త్తి దూసే ఉద్దేశ్యంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్ర‌భుత్వం.. స‌ద‌రు వార్త‌లు రాసే జ‌ర్న‌లిస్టుల అక్రిడిటేష‌న్ల‌ను ర‌ద్దు చేసేస్తామంటూ నిన్న రాత్రి ఓ సంచ‌ల‌న జీవోను జారీ చేసింది. రాత్రికి రాత్రే గుట్టు చ‌ప్పుడు కాకుండా విడుద‌లైన ఈ జీవో మీడియా వ‌ర్గాన్ని తీవ్ర క‌ల‌వ‌రానికి గురి చేసిందని చెప్పాలి.

ఈ నేప‌థ్యంలో నేటి ఉద‌యం తెల్లార‌గ‌ట్లే... రంగంలోకి దిగిన మీడియా స‌మాజం... న‌రేంద్ర మోదీ తీసుకున్న నిర్ణ‌యం మీడియా స్వేచ్ఛ‌ను హ‌రించేదేన‌ని, ఈ జీవో అమ‌లైతే వాస్త‌వాల‌ను కూడా వార్త‌లుగా రాసే ధైర్యం జ‌ర్న‌లిస్టులు కోల్పోతార‌ని, మొత్తంగా నిజాలు స‌మాధి అవుతాయంటూ గ‌గ్గోలు పెట్టింది. ఇదే స‌మ‌యంలో మీడియాతో గొంతు క‌లిపిన ప‌లు ప్ర‌జా సంఘాలు, రాజ‌కీయ పార్టీలు కూడా మోదీ స‌ర్కారు నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించాయి. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వానికి లెక్క‌లేన‌న్ని విన‌తులు వెల్లువెత్తాయి. దీంతో పున‌రాలోచ‌న‌లో ప‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిలో... కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రంగంలోకి దిగిపోయారు. ఈ జీవో విడుద‌ల‌లో త‌మ‌కు ఎలాంటి దురుద్దేశ్యాలు లేవ‌ని, ఒక‌వేళ అంద‌రూ ఆందోళ‌న చెందుతున్న‌ట్లుగా ఆ జీవోతో అంత ప్ర‌మాద‌మే ఉంటే సల‌హాలు, సూచ‌న‌లు చేస్తే స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె ఓ ట్వీట్ చేశారు. అయినా కూడా స‌ద్దుమ‌ణ‌గ‌ని ఆందోళ‌న‌ల‌తో కేంద్రం ఏకంగా తాను జారీ చేసిన జీవోను గంట‌ల వ్య‌వ‌ధిలోనే ర‌ద్దు చేయ‌క త‌ప్ప‌లేదు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన‌ట్లుగా ప్ర‌క‌టించిన టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు.. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల కంటే ముందుగానే రంగంలోకి దిగిపోయారు. ప‌త్రికా స్వేచ్ఛ‌ను ర‌క్షించాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై ఉంద‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌... ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. త‌ప్పుడు వార్త‌లు రాస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో జ‌ర్న‌లిస్టుల ఆక్రిడిటేష‌న్లు ర‌ద్దు చేస్తామ‌న‌డం పెద్ద త‌ప్పేన‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్దారు. అంత‌టితో ఆగ‌ని కేసీఆర్‌... పత్రికా స్వేచ్ఛ‌పై మోదీకి పాఠాలు చెప్పేందుకు కూడా వెనుకాడ‌లేద‌నే చెప్పాలి. త‌ప్పుడు వార్త‌ల‌ను నియ‌త్రించేందుకు ఇప్ప‌టికే చాలానే చ‌ట్టాలు అందుబాటులో ఉన్నాయ‌న్న విష‌యాన్ని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వానికి గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న చ‌ట్టాల‌తోనే త‌ప్పుడు వార్త‌ల‌కు చెక్ పెట్టే అవ‌కాశాలు ఉండ‌గా... ఇప్పుడు కొత్త చట్టాలెందుక‌ని కూడా కేసీఆర్ ప్ర‌శ్నించారు. త‌ప్పుడు వార్త‌లు రాసే జ‌ర్న‌లిస్టుల అక్రిడిటేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని చెప్ప‌డం ద్వారా మీడియా రంగంలో ప్ర‌కంప‌న‌లు రేకెత్త‌డం స‌హ‌జ‌మ‌ని, ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఇక‌పై చేయ‌రాద‌న్న కోణంలో కేసీఆర్ కేంద్రానికి భారీ క్లాసే పీకార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News