ఉత్సవ విగ్రహాలం : వైసీపీ మీద గరం గరం

Update: 2022-08-31 13:46 GMT
కుర్చీ లేదు, పదవి అన్నది మాత్రం ఉంది. దానికి కూడా అధికారాలు లేవు. పిలిచినా ఎవరూ పలకరు. ఎక్కడా కనీస మర్యాద లేదు. మరి ఈ పాటి దానికేనా లక్షల రూపాయలు సొమ్ము తాము త‌గలేసుకుంది. ఇదీ వైసీపీ మీద సొంత పార్టీ జెడ్పీటీలు  మండుతున్న తీరు. మేము నెగ్గి ఏణ్ణర్ధం అవుతోంది. మమ్మల్ని గురించిన పాపాన ఏ నాయకుడూ పోలేదు. ఇక అధికారులకు మేము అంటే కూడా పట్టదు.

అంత దాకా ఎందుకు మాకు ఏ అధికారాలు ఉన్నాయో కూడా మాకే తెలియదు. మండల సమావేశానికి మేము వెళ్లవచ్చో లేదో తెలియదు. తీరా వెళ్తే అక్కడ కుర్చీ కూడా వేయరు. ఇక మేము ఎక్కడ ఉండాలి. మాకంటూ ఆఫీస్ ఉందా అన్నది వారి రోదన, ఆవేదన. ఎంపీపీలకు ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. ఎంపీటీసీలు కూడా అక్కడ ఉంటారు. కానీ మండలం మొత్తానికి ఒకే ఒక్క ప్రజా ప్రతినిధిగా గెలిచిన జెడ్పీటీసీలకు కూర్చోవడానికైనా  ఎక్కడ ఆఫీస్ ఉంది అని వారు నిగ్గదీస్తున్నారు.

ఇదంతా విశాఖలో తాజాగా జరిగిన జెడ్పీ సమావేశంలో వైసీపీ జెడ్పీటీసీలు అధికార పక్షాన్నే నిలదీసిన వైనం. ఇది టోటల్ గా బాగానే వైరల్ కూడా అయింది. వేదిక మీద పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు కూర్చున్నారు. ఆయన ఈ సమస్య తీర్చాలి. ప్రోటోకాల్ విషయంలో జెడ్పీటీసీలకు జరుగుతున్న అన్యాయం మీద కూడా ఆయన మాట్లాడాలి.

కానీ ఆయన ప్రభుత్వంతో మాట్లాడుతాను అని అంటున్నారు. దాంతో జెడ్పీటీసీలు గుస్సా అవుతున్నారు. తమకు కనీసం గౌరవ వేతనాలు కూడా ఏడాదిగా ఇవ్వలేదని వారు వాపోతున్నారు. ముందు వాటిని అయినా ఇప్పించండి మహా ప్రభో అని మొరపెట్టుకుంటున్నారు. ఇక తమకు ఏఏ అధికారాలు ఉన్నాయి. తాము ఏఏ పనులు చేయవచ్చు. తమ పాత్ర ఏంటి అన్న దాని మీద అవగాహన కార్యక్రమాలు శిక్షణా తరగతులు పెట్టించాలని కూడా కోరుతున్నారు.

ఇలా ఒక జెడ్పీటీసీ లేచి మాట్లాడగానే మిగిలిన వారు అంతా ఆయనకు మద్దతుగా లేచి తమ వాదన వినిపించడంతో జిల్లా పరిషత్ సమావేశంలో గందరగోళం చెలరేగింది. సొంత పార్టీ మీద ఆ పార్టీకి చెందిన వారే నిప్పులు చెరుగుతూ విమర్శలు చేస్తూ ఉంటే వారు వైసీపీ వారేనా లేక టీడీపీ వారా అన్న డౌటు కూడా అందరికీ వచ్చింది.

అయినా కానీ జెడ్పీటీసీలుగా గెలిచిన వారికి తగిన మర్యాద గౌరవం ఇచ్చి వారి పదవికి న్యాయం చేయకపోతే తాము నెగ్గి కూడా  ఎందుకు అన్న మాట సొంత పార్టీలోనే వినిపిస్తోంది. మరి దీని మీద ప్రభుత్వం తగిన విధంగా రియాక్ట్ కాకపోతే ఎంత పెద్ద సంఖ్యలో గెలిచారో వారంతా కూడా యాంటీ అయినా అవుతారు, లేక సైలెంట్ అయినా అవుతారు. అపుడు తీవ్ర నష్టం పార్టీకి వాటిల్లడం ఖాయం అంటున్నారు. తీరా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ జెడ్పీటీసీల అవసరం కూడా అధికార పార్టీకి ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News