బాబు నిర్లక్ష్యం.. పవన్ లో చూశా: చదలవాడ

Update: 2018-10-25 07:55 GMT
టీడీపీలో ఉన్నప్పుడు బాబు కీర్తించిన టీటీడీ ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ - మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి.. ఇప్పుడు జనసేనలోకి చేరగానే బాబు బండారం బయటపెట్టేశాడు. చంద్రబాబు తన చిత్తూరు నియోజకవర్గాన్ని కావాలని నిర్లక్ష్యం చేశాడని ఆరోపించాడు.  పార్టీని గందరగోళ పరిచి.. పరిపాలనను, రాష్ట్ర వ్యవహారాలను దిగజార్చి అవినీతిని పెంచిపోషించాడని చదలవాడ విమర్శించారు.

టీడీపీలో ఉండగా చంద్రబాబు తనను నిర్లక్ష్యం చేశాడని..  ఏం సందర్భంలోనూ పరిగణలోకి తీసుకోలేదని.. అందుకే ఆయన వైఖరి నచ్చక బయటకు వచ్చానని చదలవాడ మీడియా ఎదుట వాపోయారు. టీడీపీ అయినవారికి అందలం.. కాని వారిని కాలదన్నుతారని ఆయన విమర్శించారు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా తన పోస్టర్లు, బ్యానర్లపై ఫొటోలు కూడా పెట్టకుండా అవమానించారని చదలవాడ వాపోయాడు.

ఇదే సమయంలో తను కొత్తగా చేరిన జనసేన పార్టీ అధ్యక్షుడిని మాత్రం చదలవాడ ఆకాశానికెత్తేశాడు. పవన్ కు సమాజంలో ఉన్న అసమానత, అన్యాయం, అవినీతిని ప్రశ్నించే ధైర్యముందని.. ఓ మంచి నాయకుడు కావడంతోనే ఆయన వెంట నడిచేందుకు టీడీపీ నుంచి జనసేనలో చేరానని చెప్పుకొచ్చాడు. తాను తన కుమారుడిని కోల్పోయానని.. పవన్ లో అతడిని చూసుకుంటున్నానని చదలవాడ ఉద్వేగంగా అన్నారు.

చదలవాడ సాదరంగా జనసేన పార్టీలో చేరినా.. కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జనసేన పార్టీలో చదలవాడ లాంటి బలిజ సామాజికవర్గ నేతకు గుర్తింపు దక్కుతుందా లేదా అన్న అనుమానం వెంటాడుతోంది... 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేయాలనుకుంటున్న ఆయన కలలు నెరవేరుతాయో..? పవన్..ఈయనకు సీటు ఇస్తాడో లేదో చూడాలి మరి.
Tags:    

Similar News