బాబుకు లింకు పెట్టి అందరి ముందు ఉరి అంట

Update: 2016-11-21 06:55 GMT
ఎన్నికల సమయంలో నోటికి వచ్చినన్ని హామీలు ఇచ్చుకుంటూ పోవటం.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్నిఎలా అమలు చేయాలో తెలీక బుర్ర గోక్కోవటం నాయకులకు అలవాటే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఉన్న రిజర్వేషన్ల మీదనే సవాలచ్చ అభ్యంతరాలు.. ఒత్తిళ్లు ఉన్న వేళ.. కాపుల్ని బీసీల్లో చేరుస్తామన్న భారీ హామీని ఇచ్చేసి.. జోరుగా ప్రచారం చేసిన ఆయన.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా అతీగతీ లేని దుస్థితి.

ఇప్పటికే.. బాబు హామీని గుర్తు చేస్తూ కాపు ఉద్యమ నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సృష్టిస్తున్న ప్రకంపనాలు అంతాఇంతా కాదు. ఆయన కానీ.. ఉద్యమ బరిలోకి దిగినా.. నిరసన దీక్ష చేపట్టినా.. ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. ఉద్రిక్తంగా మారిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఈ ఇష్యూను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లోజ్ చేయాల్సి ఉన్నా.. బాబు మాత్రం ఆ పని చేయటం లేదనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ముద్రగడ ముప్పు బాబు సర్కారుకు వీడక ముందే తాజాగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామనుజయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా కులాల వారీగా వన సమారాధ‌నలు నిర్వహించుకోవటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారి.. ఇప్పుడు మహా జోరుగా సాగుతోంది. ఇదే తీరులో కాపు సంఘ వన సమారాధన కార్యక్రమం నూజివీడులో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రామనుజయ.. చంద్రబాబును విపరీతంగా పొగిడేశారు. దీంతో.. కొందరు అభ్యంతరం చెబుతూ.. కాపులకు బాబు ఏం చేశారని ప్రశ్నించటమేకాదు.. బీసీల్లో చేరుస్తామంటూ ఇచ్చిన హామీని ఇంతవరకూ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

సభికుల నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యల ధాటికి స్పందించిన రామనుజయ.. మంజునాథ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత కాపుల్ని బీసీల్లోకి చంద్రబాబు చేరుస్తారని.. ఒకవేళ ఆ పని కానీ చేయకుంటే.. అందరి ముందు తాను ఉరి వేసుకుంటానని ఆవేశంగా రియాక్ట్ అయ్యారు. వనభోజనాలకు వచ్చిన అతిధి ఈ రకమైన వ్యాఖ్య చేయటంతో.. వాతావరణం ఒక్కసారి మారిపోయింది. ఏమైనా.. బాబును పొగిడేసే క్రమంలో.. తనను తాను బుక్ చేసుకోవ‌డ‌మే కాదు.. కొత్త శపధం బాబుకు సైతం ఇబ్బందిగా మారుతుందన్న వాదన వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News