కేంద్రం మార‌లేదు!... బాబే మారిపోయారు!

Update: 2019-02-01 11:37 GMT
కేంద్రంలో న‌రేంద్ర మోదీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన చివ‌రి బ‌డ్జెట్ లో ఓట్లు దండుకునే జిమ్మిక్కుల‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు మూడు నెల‌లు ముందుగా పార్ల‌మెంటు ముందుకు వ‌చ్చిన మోదీ చిట్ట‌చివ‌రి బ‌డ్జెట్... దేశంలో మ‌ధ్య  త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో పాటుగా వ‌చ్చే ఎన్నికల్లో వీల‌యినంత మేర ఓటింగ్‌ ను పెంచుకునే దిశ‌గానే సాగింద‌న్న వాద‌నా వినిపిస్తోంది. మొత్తంగా మోదీ త‌న ఐదేళ్ల పాల‌న‌లో చివ‌రి అంకంలో ప్ర‌జల‌ను మైమ‌ర‌పించే బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టార‌ని చెప్పాలి. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్థానంలో బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని భుజానికెత్తుకున్న మ‌రో సీనియ‌ర్ మంత్రి పీయూష్ గోయ‌ల్‌... బ‌డ్జెట్ ప్రసంగాన్ని త‌న‌దైన శైలిలో వినిపించి లోక్ స‌భ‌లో హ‌ర్షాతారేకాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేయ‌డంలో స‌ఫ‌లీకృత‌మ‌య్యార‌నే చెప్పాలి.

స‌రే ఎన్నిక‌ల టైం కాబ‌ట్టి... ఏ ప్ర‌భుత్వ‌మైనా ఇంత‌కంటే ఏం చేస్తుందిలే అనుకున్నా.. టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు మాత్రం ఈ బ‌డ్జెట్ పై గ‌తంలో మాట్లాడిన దానికి భిన్నంగా స్పందించ‌క త‌ప్ప‌లేదు. ఎందుకంటే గ‌డ‌చిన నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారంలోని బీజేపీతో అంట‌కాగిన చంద్ర‌బాబు... కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌శేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై ఆహా, ఓహో అన్న సంద‌ర్భాలు త‌క్కువే ఉన్నా.. సెంట్ర‌ల్ బ‌డ్జెట్ ను తూర్పార‌బ‌ట్టిన సంద‌ర్భం లేద‌నే చెప్పాలి. గ‌తేడాది కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో మోదీ స‌ర్కారు ఏపీకి రిక్త‌హ‌స్తం చూపిన నేప‌థ్యంలో ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు... బీజేపీతో సుదీర్ఘ చెలిమికి స్వ‌స్తి పలికారు.

చంద్ర‌బాబు ఈ త‌ర‌హా కొత్త వైఖ‌రికి బీజేపీ వైఖ‌రి కార‌ణ‌మా? అంటే... ఎంత‌మాత్రం లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... ఆది నుంచి మోదీ స‌ర్కారు ఏపీ ప‌ట్ల ప‌క్ష‌పాత వైఖ‌రితోనూ ముందుకు సాగుతోంది. మోదీ ప‌క్ష‌పాత వైఖ‌రిని ఇత‌ర ప‌క్షాల‌న్నీ ప్ర‌శ్నిస్తున్నా కూడా చంద్ర‌బాబు మాత్రం త‌ప్పు బ‌ట్ట‌క‌పోగా... మోదీ స‌ర్కారు వైఖ‌రిని కీర్తించ‌డ‌మే కాకుండా ఏకంగా భ‌జ‌న చేశారు. అయితే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఇక బీజేపీతో క‌లిసి వెళితే మునిగిపోవ‌డం ఖాయ‌మ‌న్న క‌న్‌ క్లూజ‌న్‌ కు వ‌చ్చిన చంద్ర‌బాబు త‌న వైఖ‌రిని మార్చేసుకున్నారు. ఆ మారిన వైఖరితోనే ఇప్పుడు మోదీ స‌ర్కారు బ‌డ్జెట్ పై నిప్పులు చెరిగారు. ఏపీకి ఇచ్చిన హామీలు, విభజన సమస్యల పైన చివరి బడ్జెట్‌ లోనూ కేంద్రం స్పందించలేదని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌ లో ఏపీ ప్రస్తావన లేకపోవడం దారుణం అని ఆయ‌న‌ వాపోయారు.

కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా న‌ల్ల ష‌ర్లేసుకుని అసెంబ్లీకి వ‌చ్చిన చంద్ర‌బాబు... రాష్ట్రంలో ఇప్పుడు ఆందోళనలు సరైనవేనని ఇప్పుడు మరోసారి రుజువయిందని కూడా త‌న‌దైన శైలి కామెంట్ కూడా చేశారు. చివరి బడ్జెట్‌ లోనైనా ఏమైనా చేస్తారా అని చూస్తే ఏమీ ప్రకటించలేదని చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీ నేతలకు ఏపీ కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఇండియా మ్యాప్ నుంచి ఏపీని తీసేస్తారేమోనని వాపోయారు. నేటి అన్యాయానికి పూర్తిస్థాయిలో బీజేపీదే బాధ్యత అని వ్యాఖ్యానించిన చంద్ర‌బాబు అదేదో కొత్త కామెంట్ చేసిన‌ట్టుగా క‌ల‌రింగ్ ఇచ్చారు. అంత‌టితో ఆగ‌ని చంద్ర‌బాబు... వైసీపీతో అంటకాగుతున్న బీజేపీ రాష్ట్రానికి తీర‌ని అన్యాయం చేయాలనుకుంటున్నారని త‌న‌దైన రొటీన్ కామెంట్ ను కూడా మ‌రోమారు సంధించారు. ఇక‌పై రాష్ట్రానికి సహకరించేవాళ్లతోనే తాము కలుస్తామని, ఆ క్ర‌మంలోనే తెలుగువాళ్ల కోసమే ముప్పై ఏళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్‌ తో చేతులు కలిపామని కూడా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

    

Tags:    

Similar News