కేసులున్న టీడీపీ నేత‌ల‌కు చంద్ర‌బాబు బంప‌ర్ ఆఫ‌ర్‌

Update: 2022-05-06 01:28 GMT
జిల్లాల ప‌ర్య‌ట‌న పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విశాఖ జిల్లాలో చేసిన‌ టూర్ తెలుగు త‌మ్ముళ్ల‌ల్లో ఉత్సాహాన్ని పెంచింద‌ని అంటున్నారు.బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గం తాళ్ల వలస పర్యటనలో టీడీపీ అధినేతకు పార్టీ క్యాడర్, లీడర్లు ఘనస్వాగతం పలికారు.

ఈ సంద‌ర్భంగా హై వే లో టీ బడ్డీకి వెళ్లి ప్రజలతో కలిసి టీ తాగి చంద్రబాబు మాటామంతీ జరిపారు. అనంత‌రం పార్టీ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల్లో ఉత్సాహం నింపే ప్ర‌సంగం చేశారు చంద్ర‌బాబు.

జ‌గ‌న్ పాల‌న‌లోని బాదుడే బాదుడుకు విరుగుడు తెలుగుదేశం పార్టీయేనని చంద్ర‌బాబు అన్నారు. దేశంలో ఏపీలోనే పెట్రోల్‌, డీజిల్‌కు ఎక్కువ ధర ఉందని ఆయ‌న  మండిప‌డ్డారు. తాను యువతకు ఐటీ ఉద్యోగం ఇస్తే.. జగన్‌ ఐదు వేలు జీతంలో వాలంటీర్‌ ఉద్యోగం ఇచ్చాడంటూ నిప్పులు చెరిగారు.

యువతకు ఫిష్‌ మార్కెట్లు, మటన్‌ మార్ట్‌లలో ఉద్యోగాలు ఇస్తారా అని నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉన్నయో.. ఎక్కడ గనులు ఉన్నాయో తెలుసుకోవడానికే పాదయాత్ర చేశారని చంద్ర‌బాబు ఆరోపించారు. రాష్ట్రంలో చేతకాని దద్దమన్న ప్రభుత్వం ఉందని ప్ర‌శ్నించిన వారిపై కేసులు పెడుతున్నార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

అధికార పార్టీ పెట్టే కేసుల‌కు అద‌రొద్దు, బెదరొద్దు అని పార్టీ నేత‌ల‌కు చంద్ర‌బాబు హిత‌వు పలికారు. ఈ ప్ర‌భుత్వం కేసులు పెట్టిందంటే... స‌ద‌రు నేత‌లు ప్ర‌జ‌ల్లో ఉన్న‌ట్లుగా భావించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్న చంద్ర‌బాబు, ఎన్ని కేసులు ఉంటే అంత భ‌విష్య‌త్ పార్టీలో ఉంటుంద‌న్నారు.

టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌త్యేకంగా ట్రిబ్యున‌ల్ ఏర్పాటు చేసి కేసులు ఎత్తివేయించే బాధ్య‌త తీసుకుంటాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. పార్టీ నేత‌లు ఉడాల్సింది ప్ర‌జ‌ల్లో కాని త‌న‌తో కాద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.  A1, A2లు కలిసి విశాఖను కబ్జా చేస్తున్నారని దుయ్యబట్టారు. వైజాగ్‌కు రాజధాని కాదు.. అభివృద్ధి కావాలన్నారు.
Tags:    

Similar News