పెట్రో ధరల పై చంద్రబాబుకు సంకటం

Update: 2021-11-09 12:30 GMT
మాజీ సీఎం చంద్రబాబుకు పెట్రో ఉత్పత్తుల ధరల విషయమై పెద్ద చిక్కొచ్చి పడింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో.. చాలా రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించి తమ వంతు బాధ్యతను నెరవేర్చామని చెప్పుకొంటున్నాయి. అయితే,తెలుగు రాష్ట్రాల సీఎంలు మాత్రం వ్యాట్ ను తగ్గించేంది లేదు అని చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా మేం వ్యాట్ నే పెంచలేదు. ఇక ఎందుకు తగ్గిస్తాం అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రమే ధరలు పెంచింది కాబట్టి కేంద్రమే తగ్గించాలనేది ఏపీ ప్రభుత్వ వాదన. పెట్రో ధరల విషయమై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఏపీలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సంకటంలో పడింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ‘‘చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి..’’ప్రతిపక్షాలు ఎప్పుడూ బలంగా చేసే విమర్శ ఇది. ఇప్పుడదే విమర్శను మరింత తీవ్రంగా చేస్తున్నాయి. రెండు నాల్కల్లో ఒకటి చప్పబడిందా? అంటూ నిలదీస్తున్నాయి.

అసలేంటి కథ?

పెట్రోల్, డీజిల్ ధర ఇప్పడు దేశమంతా ఉన్న సమస్య. ఎవరూ ఊహించనంతగా పెరిగిన ధరలు సామాన్యుడిని కుదేలు చేస్తున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి బతుకు భారం అవుతోంది. దీనిపై ఆలస్యంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అది స్వల్పమే అయినా.. ఎంతో కొంత తగ్గించినట్టు చెప్పుకొనేందుకు ఉంటుంది. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కోరుతోంది.

చంద్రబాబు డిమాండ్ చేయలేరు.. ఎందుకంటే?

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు 2015లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ను పెంచాయి. అప్పడు తెలంగాణకు కేసీఆరే సీఎంగా ఉండగా, ఏపీకి చంద్రబాబు సీఎం. దీనిని కేసీఆర్ విస్మరించి.. తాము వ్యాట్ ను పెంచలేదు అని చెబుతున్నారు. అది వేరే సంగతి. ఇక చంద్రబాబు విషయానికి వస్తే తాను సీఎంగా ఉండగా వ్యాట్ పెంచలేదు అని చెప్పలేని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నందున.. ప్రజల పక్షాల మాట్లాడుతున్నట్లు, పెట్రోల్ ధర తగ్గించాలి అని డిమాండ్ చేయాల్సిన అవసరం. ఒకవేళ ధర్నాలకు దిగితే.. వ్యాట్ పెంపుపై అధికార వైసీపీకి సమాధానం చెప్పుకోవాల్సిన అగత్యం. దీంతోపాటు చంద్రబాబు ధరలు పెరుగుతూ పోయినప్పుడు కేంద్రంలోని బీజేపీని ఏమీ అనకుండా తగ్గినప్పడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి భయపడి.. చంద్రబాబు రెండు నాల్కల్లో ఒకటి చప్పబడిందా? అంటూ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.


Tags:    

Similar News