చంద్ర‌బాబు నిర్ణ‌యం.. ఆ ఎంపీకి ప్ల‌స్సా.. మైన‌స్సా?

Update: 2021-12-29 00:30 GMT
టీడీపీ బెజ‌వాడ రాజ‌కీయాలు అనూహ్యంగా మారాయి. బెజ‌వాడ‌లో మొత్తం మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. రెండు నియోజ క‌వ‌ర్గాల‌పై ప‌ట్టున్న టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఒక నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. 2014లో మాత్రం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యం సాధించింది. కానీ, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం టీడీపీ ఆవిర్భ‌వించిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా పార్టీ విజ‌యం ద‌క్కించుకున్న‌ది లేదు. ఇక‌, ఇప్పుడు ఇక్క‌డ టీడీపీ ప‌రిణామాలు ఆస‌క్తిగా మారుతున్నాయి.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ నాయ‌కుడిగా ఉన్న‌.. జ‌లీల్ ఖాన్‌ను దాదాపు ప‌క్క‌న పెట్టేశారు. 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన మాజీ కాంగ్రెస్ నాయ‌కుడు జ‌లీల్ అనారోగ్య కారణాల‌తో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కుమార్తెను బ‌రిలో దింపినా.. ఆమె ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేస్తార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తూ వ‌చ్చింది. జ‌లీల్ మాత్రం ఈ సీటును వ‌దులుకునేది లేద‌ని అంటున్నారు. కానీ, ఇంత‌లోనే.. చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌గ్గాలు అప్ప‌గించారు.

ఇంచార్జ్‌గా నియ‌మించారు. వాస్త‌వానికి ఆయ‌న ఎంపీగా ఉన్నారు. కానీ, ఆయ‌న కుమార్తె, ప్ర‌స్తుతం కార్పొరేట‌ర్ గా ఉన్న కేశినేని శ్వేత‌ను ప‌శ్చిమ నుంచి పోటీ చేయించాల‌నేది.. కేశినేని వ్యూహం. దీనిపై కొన్నాళ్ల కింద‌ట ఇక్క‌డ పెద్ద ర‌గ‌డే జ‌రిగింది. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టుకోసం ఆయ‌న ప్ర‌య‌త్నించ‌డం.. కానీ, పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాక‌పోవ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల అనంత‌రం.. కేశినేనిని ఇక్క‌డ ఇంచార్జ్‌గా నియ‌మించారు. వాస్త‌వానికి ఆయ‌న కుమార్తె శ్వేత‌కే ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉన్నా.. ఇప్ప‌టికిప్పుడు ఇస్తే. ర‌గ‌డ మ‌రింత పెరుగుతుంద‌ని భావించి ఉంటార‌ని అంటున్నారు.

అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి శ్వేత‌కు టికెట్ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌, కేశినేనికి ఉన్న ప‌లుకుబ‌డి.. మైనారిటీ వ‌ర్గాల్లో ఉన్న స్నేహం వంటివి సాన‌కూల ప‌రిణామాలుగా మారి.. శ్వేత క‌నుక గెలుపుగుర్రం ఎక్కితే.. నాలుగు ద‌శాబ్దాలుగా ఎగ‌ర‌ని టీడీపీ జెండా ఖ‌చ్చితంగా ఇక్కడ ఎగిరి తీరుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇక్క‌డ మ‌రోస‌మ‌స్య ఉంది. అదే జ‌లీల్ ఖాన్‌. మైనారిటీ వ‌ర్గంలో మంచి ప‌లుకుబ‌డి ఉన్న ఆయ‌న..రెబ‌ల్‌గా మారితే టీడీపీకి ఇబ్బందే. ఓట్లు చీలితే.. అది వైసీపీకి ల‌బ్ధి చేకూర్చే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ టీడీపీ అడుగులు ఆస‌క్తిగా మారాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


Tags:    

Similar News