ఓట‌మి తెలిసినా.. జ‌గ‌న్ సొంత‌గ‌డ్డ‌పై స‌మ‌రానికి బాబు సై

Update: 2021-09-04 08:31 GMT
కొన్నిసార్లు ఎన్నిక‌ల్లో పార్టీల గెలుపోట‌ములు ముందే తెలిసిపోతుంటాయి. క్షేత్ర‌స్థాయిలో ఉన్న బ‌లం స్థానిక ప‌రిస్థితులు ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీ హ‌వా ఇలా చాలా అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎన్నిక‌ల్లో పార్టీ గెలుస్తుందో? లేదో ముందుగానే అంచ‌నా వేస్తారు. కానీ కొన్నిసార్లు ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలిసినా గౌర‌వం కోస‌మ‌ని త‌మ ఉనికిని చాట‌డానిక‌ని ప్ర‌త్య‌ర్థిని స‌వాలు చేయ‌డానిక‌ని ఇలా వివిధ కార‌ణాల‌తో పార్టీలు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌తాయి. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో పోటీకి సిద్ధ‌మైన తెలుగు దేశం పార్టీ ఇలాంటి కోవాలోకే వ‌స్తోందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా  క‌డ‌ప‌లో ఉంది. ఈ ఏడాది మార్చిలో అక్క‌డి వైసీపీ ఎమ్మెల్యే వెంక‌ట సుబ్బ‌య్య చ‌నిపోయారు. దీంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది.ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు ఈ ఎన్నిక నోటిఫికేష‌న్ రాక‌ముందే త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

ఈ ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థిగా ఓబులాపురం రాజశేఖ‌ర్ పేరును మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. 2019 ఎన్నిక‌ల్లో వెంక‌ట సుబ్బ‌య్య చేతిలో రాజ‌శేఖ‌ర్ ఓడిపోయారు. అప్పుడు 44 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో సుబ్బ‌య్య ఘ‌న విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు 95,482 ఓట్లు రాగా.. రాజ‌శేఖ‌ర్‌కు 50,748 ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయి. అయితే గ‌త ఫ‌లితాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని బాబు మ‌రోసారి రాజ‌శేఖ‌ర్‌కే టికెట్ కేటాయించారు. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగో ఓట‌మి త‌ప్ప‌దు కాబ‌ట్టి మ‌రోసారి రాజ‌శేఖ‌ర్‌కు అవ‌కాశం ఇవ్వ‌డంలో త‌ప్పేమీ లేద‌ని బాబు భావించిన‌ట్లు రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు.

సీఎం సొంత జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గనున్న ఈ ఉప ఎన్నిక‌లో ఎలాగో అధికార వైసీపీ పార్టీనే గెలుస్తుంద‌నే అంచ‌నాలున్నాయి. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది పైగా అది జ‌గ‌న్ సొంత జిల్లా ఈ నేప‌థ్యంలో క‌చ్చితంగా విజ‌యం వైసీపీదే అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసే వెంక‌ట‌సుబ్బ‌య్య స‌తీమ‌ణి డాక్ట‌ర్ సుధ విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం మొద‌లెట్టారు.

ఒక‌ప్పుడు వీరారెడ్డి హ‌యాంలో బద్వేలు టీడీపీకి కంచుకోట‌గా ఉండేది. అనంత‌ర రాజ‌కీయ ప‌రిణామాల్లో అక్క‌డ వైసీపీ బ‌లంగా త‌యారైంది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి ఎద‌రు నిలిచి టీడీపీ గెల‌వ‌డం అసాధ్య‌మైన‌ప్ప‌టికీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింప‌డం కోస‌మే అక్క‌డ పోటీ చేస్తుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో అధికార పార్టీకి ప్ర‌త్య‌ర్థిగా టీడీపీ మాత్ర‌మే ఉంది. 2023 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న టీడీపీ.. ఈ ఉప ఎన్నిక పేరుతో ప్ర‌చారం చేప‌ట్టి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లను మ‌రింత ప‌దును పెట్టాల‌నే ఉద్దేశంతో ఉంద‌ని టాక్‌.
Tags:    

Similar News