బాబు ఒక‌టేస్తే! ... మోదీ రెండేశారు!

Update: 2019-02-25 08:45 GMT
ఎన్నిక‌ల వేళ తాయిలాల మోత మోగిపోతోంది. విప‌క్షాలు తాము అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో చెబుతూ ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు య‌త్నిస్తుంటే... అధికారంలోని పార్టీలు మాత్రం కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటుగా ఏకంగా వాటిని అమ‌ల్లోకి తెచ్చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏపీ అసెంబ్లీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైన వేళ‌... ఇటు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప‌థ‌కాలకు తెర తీశాయి. ఈ త‌రహా య‌త్నాల్లో ఇప్పుడు ఈ రెండు ప్ర‌భుత్వాలు కూడా ఒకే త‌ర‌హా ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ... కొత్త చ‌ర్చ‌కు తెర తీశాయి. తెలంగాణ‌లో రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద ప్ర‌భుత్వం ఉచితంగా ఎక‌రాకు రూ.8 వేలు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మొత్తాన్ని కేసీఆర్ స‌ర్కారు ఇప్పుడు రూ.10వేల‌కు పెంచేసింది.

ఈ ప‌థ‌కాన్ని కాపి కొట్టేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ‌వ్యాప్తంగా ఈ త‌ర‌హా ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టాల‌న్న ఉద్దేశంతో పీఎం స‌మ్మాన్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ ప‌థ‌కం నిన్న దేశ‌వ్యాప్తంగా అమ‌ల్లోకి వ‌చ్చేసింది. ఇందులో భాగంగా తొలి విడ‌త కింద రూ.2 వేల చొప్పున దేశంలోని కోటి మంది రైతుల‌కు అంద‌జేశారు. ఆన్‌ లైన్ ట్రాన్స్‌ప‌ర్ ద్వారా ఈ నిధుల‌ను మోదీ స‌ర్కారు... నేరుగా రైతుల ఖాతాల‌కే బ‌దిలీ చేసేసింది. ఇక నేడు, రేప‌టిలోగా మ‌రో రెండు కోట్ల మంది రైతుల ఖాతాల‌కు కూడా ఈ నిధుల‌ను జ‌మ చేయ‌నున్న‌ట్లుగా స‌మాచారం.

ఇదే స‌మ‌యంలో మోదీ కంటే కాస్తంత ముందే ఉన్న‌ట్లుగా క‌ల‌రింగ్ ఇచ్చేసిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... కేసీఆర్ ప‌థ‌కం త‌ర‌హాలో అన్న‌దాతా సుఖీభ‌వ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ ప‌థ‌కంలో త‌న‌దైన మార్కు ట్విస్టులిచ్చిన చంద్ర‌బాబు.. కేంద్రం ఇచ్చే రూ.6 వేల‌ను క‌లుపుకుని ఐదెక‌రాల‌లోపు భూమి ఉన్న రైతుల‌కు రూ.15 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా మోదీ కంటే ముందు ఉండాల‌న్న కోణంలో ఆలోచించి... రాష్ట్రంలోని 50 ల‌క్ష‌ల మంది కైతుల‌కు ఒక్కొక్క‌రికి తొలి విడ‌త‌గా రూ.1,000 అందించారు. అంటే... చంద్ర‌బాబు ఇచ్చిన వెయ్యి, మోదీ ఇచ్చిన రెండు వేల‌తో క‌లుపుకుని ఏపీలోని రైతుల‌కు రూ.3 వేలు అందింద‌న్న మాట‌. మ‌రి ఈ మూడు వేల సాయాన్ని అందుకున్న రైతులెంత‌మంది అన్న విష‌యాన్ని చంద్ర‌బాబు స‌ర్కారు ఎప్పుడు బ‌య‌ట‌పెడుతుందో చూడాలి.


Tags:    

Similar News