చంద్రబాబు ఎమోషన్: గెలిపిస్తే అసెంబ్లీకి లేదంటే ఇవే ఆఖరి ఎన్నికలు

Update: 2022-11-17 04:23 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు నోటి నుంచి అరుదైన వ్యాఖ్యలు వచ్చాయి. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాని మాట ఒకటి ఆయన నోటి నుంచి రావటం ఇప్పుడు సంచలనంగా మారింది.

కర్నూలు జిల్లా పత్తికొండక అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అనూహ్య వ్యాఖ్యలు చేశారు.'ఇవే నాకు చివరి ఎన్నికలు. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే. లేదంటే ఇక మీ ఇష్టం. అసెంబ్లీలో నన్ను అవమానించారు. నా భార్యను కూడా అవమానించారు.

ఇప్పుడున్నది కౌరవ సభ. దాన్ని నేను గౌరవ సభగా మారుస్తా' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. హైకోర్టుకు తాను అడ్డుపడుతున్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని.. అంతమంది ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఉండి ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నించిన ఆయన.. వాళ్లు రాష్ట్రానికి ఏమైనా పనికి వస్తున్నారా? అని మండిపడ్డారు.

ఇదే సభలో చంద్రబాబు మాట్లాడుతూ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. 2003లో తనపై 23 మందు పాతరులు పేలిస్తే శ్రీ వేంకటేశ్వరస్వామి తనను కాపాడారని. ఇప్పుడు రాష్ట్రంలో ఆరాచకం రాజ్యమేలుతోందన్నారు. ఆ ఆరాచక శక్తుల్ని తుదముట్టించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు శాఖకు కొందరు చెడ్డపేరు తెస్తున్నారని.. అలాంటి వారికి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిప్పలు తప్పవని హెచ్చరించారు. మంచి పోలీసుల్ని తాము గౌరవిస్తామన్నారు.

తప్పులు చేసిన పోలీసుల్ని జగన్ కాపాడలేరన్న ఆయన.. తన వయసును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రానున్న ఎన్నికలే తనకు చివరి ఎన్నికలన్న ఆయన మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

తన తర్వాత తాను వేరే వారికి బాధ్యతలు అప్పగించి వెళతానని చెప్పటం చూస్తే.. చంద్రబాబు కొత్త తరహా ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ వ్యాఖ్యలపై ఏపీ అధికారపక్షం ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నద ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News