జగన్ శంఖారావం..బాబు బుజ్జగింపులు మొదలు

Update: 2019-02-15 06:04 GMT
ఎన్నికలు సమీపిస్తున్నాయి.. డేట్ ఇంకా ఎంతో దూరంలో లేదు. ప్రతిపక్ష నేత పాదయాత్ర ముగించి సమరోత్సాహంతో జిల్లాల పర్యటనలు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం ఉన్న టీడీపీ నేతలను వైసీపీలోకి వెళ్లకుండా కాపాడుకునే పనిలో పడ్డారు. జగన్ ఏ జిల్లాకు వెళ్తున్నారో ముందుగానే తెలుసుకొని ఆ జిల్లా అసంతృప్తులను పార్టీ మారకుండా బుజ్జగించే పనిలో బాబు ప్రస్తుతం బిజీగా ఉన్నారట.. ప్రస్తుతం నెల్లూరు జిల్లా అసంతృప్తులపై బాబు దృష్టిపడింది.

గడిచిన ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ సత్తాచాటింది. పదింట ఏడు స్థానాలు గెలిచి జిల్లాపై వైసీపీ ఆదిపత్యం చాటింది. నెల్లూరు పరిధిలోని రెండు ఎంపీ సీట్లు కూడా వైసీపీకే దక్కాయి. ప్రస్తుతం ఏడుగురిలో ఒకరు టీడీపీలో చేరగా.. ఆరుగురు వైసీపీలోనే ఉన్నారు. దీంతో బలమైన నెల్లూరు జిల్లా నుంచే జగన్ భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి నాంది పలుకుతున్నారు. ఈ నెల19న నెల్లూరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి కూడా నెల్లూరులో పదికి పది స్థానాలు వైసీపీ గెలిచేలా జగన్ సమరశంఖం పూరిస్తున్నారు.

నెల్లూరులో టీడీపీ అసంతృప్తుల సంఖ్య పెరిగిపోయింది. ఇటీవల చంద్రబాబు కొన్ని అసెంబ్లీ స్థానాలు ఖారారు చేశారు. దీంతో ఆ సీట్లు ఆశించిన వారంత రగిలిపోతున్నారు. వాళ్లంతా జగన్ బహిరంగ సభలో వైసీపీలో చేరుతారనే ప్రచారం జిల్లాలో సాగుతోంది. నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆనం జయకుమార్ రెడ్డి - నెల్లూరు సిటీ టికెట్ విషయంలో  మంత్రి నారాయణ చేతిలో అవమానాల పాలైన నగర మేయర్ అజీజ్ - కోవూరు సీటుపై మనస్తాపం చెందిన శ్రీనివాసులు రెడ్డి ఈ ముగ్గురు వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

జగన్ బహిరంగ సభ దృష్ట్యా.. చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. ఈ ముగ్గురిని అమరావతికి పిలుపించుకొని మంతనాలు జరుపుతున్నారు. వాళ్లకు తాయిలాలు ఇస్తూ బుజ్జగింపులకు శ్రీకారం చుట్టారు. కానీ వారు సీటు తప్ప వేరే దేనికి ఒప్పుకునే పరిస్థితులు కనిపించడం లేదు.  దీంతో ఈ ముగ్గురు వైసీపీ వైపు వెళ్లడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అదే కనుక జరిగితే నెల్లూరు జిల్లా నుంచి టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కడం అనుమానం అన్న అంచనాలు బలపడుతున్నాయి.
 



Tags:    

Similar News