నరసింహన్ హ్యాపీనెస్ ను ఎలా అర్థం చేసుకోవాలి?

Update: 2016-11-05 08:22 GMT
దేశంలో గవర్నర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ.. ఎవరికి దక్కనంత విలువ.. మర్యాద.. పేరు ప్రఖ్యాతులు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు దక్కిందని చెప్పక తప్పదు. గవర్నర్ గా కాంగ్రెస్ వృద్ధ నేత తివారి అనూహ్య పరిస్థితుల్లో గవర్నర్ గిరి నుంచి తొలగించాల్సిన వేళ..నరసింహన్ ను తెలుగు గడ్డ మీదకు తీసుకొచ్చారు. సీబీఐ మాజీ చీఫ్ గా ఉన్న ఆయన సోనియా పరివారానికి అత్యంత ఆఫ్తుడు.. సన్నిహితుడు.. అన్నింటికి మించి విధేయుడు. అందుకే ఆయన్ను ఏపీకి తీసుకొచ్చారు.

కాంగ్రెస్ కు సమర్థవంతమైన నాయకత్వం లేని ఏపీకి మాజీ పోలీస్ బాస్ అయిన నరసింహన్ గవర్నర్ హోదాలో ఉంటే.. పరిస్థితుల తీవ్రతను ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరేవేసే విషయంలో ఎలాంటి తప్పులు జరగవన్నది కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనగా చెబుతారు. అలా మొదలైన నరసింహన్ గవర్నర్ గిరి.. రోజులు గడుస్తున్న కొద్దీ.. పరిస్థితులు సంక్లిష్టంగా మారినప్పటికీ ఆయన స్థానం మాత్రం చెక్కు చెదర్లేదు.

రాష్ట్రం రెండు ముక్కలైనా.. రెండు రాజకీయ పార్టీలు.. ఇద్దరు చంద్రుళ్లు ముఖ్యమంత్రులైనప్పటికీ.. ఆయన మాత్రం ఇద్దరికి కావాల్సిన వ్యక్తిగా మారటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. అన్నింటికి మించి కేంద్రం కాంగ్రెస్ కాస్తా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేసర్కారు పవర్ లో ఉన్నప్పటికీ ఆయన స్థానం చెక్కుచెదర్లేదు.

ఒక రాష్ట్రంలో గవర్నర్ గా వచ్చిన ఏ ప్రముఖుడైనా దీర్ఘాకాలం కొనసాగితే.. ఆయన ప్రభ ఎంతోకొంత మసకబారుతుంది. అందులోకి కొత్త కొత్త నాయకత్వాలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పుడు గవర్నర్లతో పేచీలు వస్తుంటాయి. కానీ.. నరసింహన్ వ్యవహారం వేరు. రాష్ట్రంలో అధికారిక కేంద్రాలు మార్పులకు గురైనా.. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నా గవర్నర్ గా నరసింహన్ ప్రాధాన్యత రోజురోజుకీ పెరుగుతున్నదే తప్పించి తగ్గని పరిస్థితి.

తాజాగా శుక్రవారం జరిగిన నరసింహన్ బర్త్ డే వ్యవహారాన్నే చూస్తే.. ఇద్దరు చంద్రుళ్లు గవర్నర్ ఇంటికి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వెళ్లటమే కాదు.. ఎవరికి వారు కొన్ని బహుమతుల్ని ప్రత్యేకంగా తీసుకురావటం గమనార్హం. స్వీట్లు.. పూతరేకులు.. కేకును ఏపీ ముఖ్యమంత్రి తీసుకొస్తే.. ప్రత్యేకంగా ఎంపిక చేసిన రామ సీతాఫలాలు.. సీతాఫలాల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చారు.

ఏపీ ముఖ్యమంత్రితో పాటు కొందరు నేతలు మాత్రమే వస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత దాదాపు 119 మందికి తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజ్ భవన్ కు వచ్చి మరీ బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పటం విశేషంగా చెప్పాలి. ఇక.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత నెంబర్ టూగా అని చెప్పే కేటీఆర్ అయితే.. గవర్నర్ నరసింహన్ కాళ్లకు మొక్కస్తే.. ఆయన తరహాలోనే మరికొంత మంది ముఖ్యులు కూడా గవర్నర్ కాళ్లకు మొక్కటం చూసినప్పుడు ఆయన ప్రభ ఎంతలా వెలిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోనే పలు అంశాల్లో నెంబర్ వన్ స్థానాల్లో నిలుస్తున్న రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్న వారు తన పట్ల అంత అభిమానంగా..ప్రేమగా వ్యవహరించటం చూసినప్పుడు ఏ గవర్నర్ కు అయినా.. సంతోషం కలగకుండా ఉంటుందా? అందుకే కాబోలు.. తన జీవితంలో తాజా పుట్టిన రోజున తనకెంతో ఆనందం కలిగించిందని ఆయన నోటి నుంచి వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News