మోడీ మనసును ఏ చంద్రుడు దోచుకుంటారో?

Update: 2016-08-26 07:07 GMT
కేంద్రం కరుణ కోసం చకోర పక్షుల్లా వ్యవహరిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇప్పుడో అంశం మీద విపరీతమైన పోటీ నడుస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లును ఇద్దరు చంద్రుళ్లు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపాలన్న ఆత్రుతలో ఉన్నారు. ఇందులో భాగంగా ఎవరికి వారుగా తామే ముందు ఉండాలన్నట్లుగా వ్యవహరించటం గమనార్హం.

దేశంలో పన్నుల వ్యవస్థను సమూలంగా మార్చేసే వీలున్న జీఎస్టీ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు చట్టంగా మారడానికి మెజార్టీ రాష్ట్రాల సమ్మతి అవసరం. దీంతో.. తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల నుంచి ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసేలా  కేంద్రం పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ బిల్లుకు తమ ఆమోదం తెలుపుతూ అసోం.. బీహార్.. ఛత్తీస్ గఢ్.. గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్.. జార్ఖండ్.. మధ్యప్రదేశ్  రాష్ట్రాలు ఓటేసి కేంద్రానికి పంపాయి.

జీఎస్టీ బిల్లును ఆమోదించి పంపటం ద్వారా మోడీ మనసును దోచుకునేందుకు వీలుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపే అంశంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇద్దరు చంద్రుళ్లు అసెంబ్లీని కొలువు తీర్చాలని భావిస్తున్నారు. వచ్చే నెల 8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అంతకు ముందే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని ఏర్పాటు చేసి జీఎస్టీ బిల్లును ఆమోదించి పంపితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఏపీ కంటే ముందు జీఎస్టీ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేసి పంపటం ద్వారా మోడీ దగ్గర మార్కులు కొట్టేసే అవకాశాన్ని వృధా చేసుకోకూడదన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆలోచన కారణంగానే వచ్చే నెల రెండో వారం తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న తలంపులో అనుకున్నప్పటికీ.. వెనువెంటనే అసెంబ్లీని కొలువు తీరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట. అలా కుదరకపోతే ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి.. ఆమోద ముద్ర వేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారట. జీఎస్టీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపించాలన్న అంశంలో ఇద్దరు చంద్రుళ్ల మధ్యనున్న పోటీలో ఎవరు ముందుంటారన్నది మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుందని చెప్పాలి.
Tags:    

Similar News