చంద్రబాబుకు చంద్రగిరి ఫోబియా

Update: 2018-09-16 06:25 GMT
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు లోని ఓ నియోజకవర్గమంటే ఆయనకు ఎక్కడలేని భయమంట. ఇప్పుడా నియోజకవర్గానికి ఆయన తనయుడు లోకేశ్‌ ను ఇంఛార్జిని చేయాలన్న ప్రతిపాదన రావడంతో ఆయన కంగారుపడి ఆ డిమాండ్ బలపడకముందే ఆగమేఘాలమీద మరో ఇంచార్జిని నియమించేశారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఇంకేదో కాదు, చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గం. అయితే.. చంద్రబాబు - లోకేశ్‌ లు చంద్రగిరి అంటే అంతగా టెన్షన్ పడడానికి కారణాలున్నాయి.
   
నిజానికి చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలైంది ఈ నియోజకవర్గంలోనే. 1978లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది ఇక్కడనుంచే. కానీ, రెండో ఎన్నికల్లో ఆయన్ను ఇదే నియోజకవర్గ ప్రజలు ఓడించారు. దాంతో 1989 ఎన్నికలకు ఆయన కుప్పం నియోజకవర్గానికి మారిపోయారు. అప్పటి నుంచి కుప్పం నుంచే ఆయన ఎన్నికవుతూ వస్తున్నారు.
   
ఇక చంద్రగిరి నియోజకవర్గం విషయానికొస్తే ఆ నియోజకవర్గం టీడీపీ చేజారి రెండు దశాబ్దాలైపోయాయి. 1994లో చివరిసారిగా ఇక్కడ టీడీపీ నెగ్గింది. 1999 - 2004 - 2009 - 2014.. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నుంచి ఓటమినే మూటగట్టుకుంది. ఇక్కడ టీడీపీ పరిస్థితి ఎలా ఉందంటే... రీసెంటుగా మాజీ మంత్రి గల్లా అరుణ  ఈ నియోజకవర్గం బాధ్యతలు తనకు వద్దని తప్పుకొన్నారు. దీంతో నారా లోకేశ్ ఇక్కడి బాధ్యతలు తీసుకుంటేనే మళ్లీ టీడీపీ జెండా ఎగురుతుందన్న వాదన అక్కడి నేతల నుంచి వినిపించింది. ఈ సంగతి చంద్రబాబుకు చేరడంతో ఆయన ఒక్కసారిగా గాభరాపడిపోయారట. తననే రెండోసారి ఓడించిన చంద్రగిరి.. అందులోనూ ఇరవయ్యేళ్లుగా తెలుగుదేశం నేతన్నవాడెవడూ గెలవని చంద్రగిరికి తన గారాల కొడుకును పంపితే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందన్న భయం ఆయన్ను తెగ టెన్షన్ పెట్టిందట. మరోవైపు లోకేశ్ కూడా చంద్రగిరి అంటూ అడ్డంగా తలూపుతున్నారట... దీంతో ఈ డిమాండు మళ్లీ వినిపించకుండా చంద్రబాబు అర్జంటుగా ఆ నియోజకవర్గానికి వేరే ఇంచార్జిని నియమించారు.
Tags:    

Similar News