పవన్ - బాబు బంధం..వాళ్లే బయటపెట్టుకుంటున్నారు!

Update: 2019-04-08 04:55 GMT
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రకారమే పోటీ చేస్తూ ఉందనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అందుకు తగ్గట్టుగా అనేక పరిణామాలు సాగుతూ ఉన్నాయి. ఆ విషయం సుస్పష్టం  అవుతూ ఉంది.

ప్రధానంగా జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చేస్తున్న ఎన్నికల ప్రచార ప్రసంగాలు ఆ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడా చంద్రబాబు నాయుడును పల్లెత్తి ఒక్క మాట అనడం లేదు పవన్ కల్యాణ్. బహుశా ఇలా కేవలం ప్రస్తుత ప్రతిపక్ష పార్టీని లక్ష్యంగా చేసుకుని, ప్రస్తుత అధికార పార్టీని పల్లెత్తు మాట అనుకుండా ఎన్నికల ప్రచారం చేసిన వాళ్లు చరిత్రలో ఎవరూ ఉండరు. అలాంటి రాజకీయ పార్టీ అధినేత కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే అని చెప్పక తప్పదు.

ఇక చంద్రబాబు నాయుడు కూడా పవన్ కల్యాణ్ ను పెద్దగా ఏమీ అనడం లేదు. ఏదో సుతారం.. ‘పవన్ కు అత్తారింటికి దారి తెలీదు..’ అనడమే తప్ప ఒక్క మాట అనడం లేదు బాబు. ఇలా వీరిద్దరూ తమ బంధాన్ని చాటుకొంటూ ఉన్నారు.

ఇక పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో ఉన్న గాజువాక నియోజకవర్గం చిత్రాలు మరింత చోద్యంగా ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. సదరు అభ్యర్థి తమ పార్టీ అధినేత వచ్చి ప్రచారం చేయాలని కోరుతూ ఉన్నారట. అయితే చంద్రబాబు  మాత్రం గాజువాకకు ప్రచారానికి వెళ్లలేదు!

విశాఖకు చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం మూడు సార్లు వెళ్లారు. గాజువాక పక్క నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేశారు. అయితే గాజువాకలో మాత్రం చంద్రబాబు నాయుడు అడుగుపెట్టలేదు. ఈ విషయంలో పోటీలో ఉన్న అభ్యర్థి కోరుతున్నా బాబు మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

ఇదంతా తెలుగుదేశం- జనసేనల లోపాయి కారీ ఒప్పందంలో భాగమే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తిరుపతిలో అటు కాంగ్రెస్ పార్టీ వాళ్లూ గట్టిగా ప్రచారం చేశారు. టీడీపీ కూడా చిరును ఓడించాలని చూసింది. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ కు మాత్రం తెలుగుదేశం నుంచి పూర్తి సహకారం అందుతున్నట్టుగా ఉంది. ఇక గాజువాకలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. సినిమా హీరోని కాకుండా.. లోకల్ హీరోని గెలిపించాలంటూ జగన్ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని స్థానికులకు జగన్ పిలుపునిచ్చారు!

Tags:    

Similar News