ఆ పాఠాలు ముందు లోకేష్ కే అవసరమేమో!

Update: 2016-03-19 05:03 GMT
వారసులకు ఒక సౌలభ్యం ఉంటుంది. ఆ మధ్యన రాంచరణ్ ఎంట్రీ సందర్భంలో ఏదో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘వాడి నాన్న చిరంజీవి అండి’’ అంటూ రాంచరణ్ కు ఉన్న సౌలభ్యాన్ని చెప్పుకొచ్చారు. చిరంజీవి మాటలు వాస్తవమనే చెప్పాలి. కెరీర్ లో ఎదిగేందుకు చిరంజీవి పడినంత కష్టం రాంచరణ్ కు అవసరం లేదుగా. ఇది సినిమా కుటుంబాలకే కాదు.. రాజకీయ.. వ్యాపార కుటుంబాలన్నింటికి ఈ లాభం ఉంటుంది.

ఎవరి సంగతో ఎందుకు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ సంగతే తీసుకోండి. చంద్రబాబు కుమారుడన్న ట్యాగ్ ను తీసేసి చూస్తే.. ఆయన తనదైన ముద్రను వేశారా? అని ప్రశ్నిస్తే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి. చంద్రబాబు కుమారుడు కాకుంటే..ఈ రోజున ఆయనున్న స్థానంలోకి సాదాసీదా జీవికి ఎంతకష్టం? అయితే.. ఇక్కడ మరో విషయాన్ని చెప్పాలి. కుటుంబం కారణంగా వచ్చే స్థానాన్ని అందిపుచ్చుకొని.. దానికి తనదైన మార్క్ ను వేయాల్సిన బాధ్యత వారసుల మీద ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. కుమార్తెలే దీనికి నిదర్శనం. తండ్రి చాటు బిడ్డలుగా రాజకీయాల్లోకి వచ్చినా.. అనతికాలంలో తమ ప్రతిభతో ఎలాంటి స్థానాలకు చేరుకున్నారో తెలిసిందే. ఒకప్పుడు టీఆర్ ఎస్ లో నెంబర్ టూ అన్న వెంటనే వినిపించే మాటకు ప్రత్యామ్నాయంగా తన పేరును తెర మీదకు తీసుకురావటమే కాదు.. అందరూ ఆమోదించే స్థాయికి కేటీఆర్ వెళ్లటం చూసినప్పుడు తండ్రి అండతో పాటు.. సొంతంగా సాధించే సత్తా ఎంత అవసరమన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ వ్యవహారంలోకి వెళితే.. ఆయన తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు.

సూపర్ బాస్ గా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా తన పార్టీ నేతలందరికి ఓ ప్రొఫెసర్ల బృందంతో పాఠాలు చెప్పిస్తున్నారు. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ప్రభుత్వ విప్ లు ఇలా వారూవీరు అన్న తేడా లేకుండా.. స్వల్ప వ్యవధి శిక్షణ తరగతుల్నిఏర్పాటు చేశారు. ఇదేం తప్పు కాకున్నా.. ఇలాంటివి ఏర్పాటు చేసే సమయంలో.. ముందుగా చినబాబు ట్రైనింగ్ అయితే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుసరించిన విధానాలు.. సబ్జెక్ట్ ను పెంచుకోవటానికి నేతలు చేయాల్సిన కసరత్తు లాంటి అంశాలపై నేతలకు ప్రొఫెసర్ల బ్యాచ్ పాఠాలు చెప్పింది. ఇవన్నీ వర్క్ వుట్ అయ్యేటట్లైతే.. చినబాబు ఇప్పటికే తానేందో ఫ్రూవ్ చేసుకొని ఉండేవారు కదా అంటూ వినిపిస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలకు ఎవరు సమాధానం చెప్పగలరు..?
Tags:    

Similar News