బాబుతోనే పవన్..లెక్కలన్నీ మారిపోయాయి!

Update: 2019-09-02 11:22 GMT
ఏపీలో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు కూడా గడవక ముందే సమీకరణాలు మారిపోతున్న వైనం చూస్తుంటే నిజంగానే ఆశ్యర్యం వేయక మానదు. మొన్నటి ఎన్నికల్లో బాబును భారీగానే టార్గెట్ చేసినట్టు కనిపించిన జనసేనాని పవన్ కల్యాణ్... వైసీపీకి దక్కిన బంపర్ విక్టరీతో తన వైఖరి మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో జనసేనను దూరం చేసుకుని - బీజేపీతో సొంతంగానే సున్నం పెట్టేసుకుని దెబ్బైపోయామన్న రీతిలో ఆలోచన చేస్తున్న టీడీపీ కూడా 2024 ఎన్నికల్లో మరోమారు ఆ రెండు పార్టీలతో జత కట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు చూస్తుంటే ఇదే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

2014 ఎన్నికల్లో ఓ వైపు బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... మరోవైపు జనసేనతోనూ పొత్తు పెట్టుకున్నారు. ఓడిపోయే స్థానాలను బీజేపీకి అంటగట్టేసిన చంద్రబాబు.. వ్యూహాత్మకంగా వ్యవహరించి జనసేనకు అసలు సీట్లే ఇవ్వని రీతిలో రాజకీయం నడిపారు. కొత్త పార్టీ అప్పుడే పోటీ అంటే బాగోదు అన్న మాటను జనసేనాని నుంచే వినిపించిన బాబు తనదైన శైలిలో చక్రం తిప్పారు. ఏమైందో తెలియదు గానీ... కాలక్రమంలో జనసేనాని టీడీపీకి దూరం జరగగా... చంద్రబాబు బీజేపీకి దూరం జరిగారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు వేర్వేరుగానే పోటీ చేసినా... వైసీపీ సింగిల్ గానే బరిలోకి దిగి అందరి అంచనాలను తలకిందులు చేసి సత్తా చాటింది.

వైసీపీ విజయం దరిమిలా జగన్ సీఎం కుర్చీలో సెటిల్ అయిపోగా... ఈ మూడు పార్టీలు కూడా ఇప్పుడు జగనే టార్గెట్ గా కదులుతున్నాయి. మరోవైపు టీడీపీకి ఈ ఎన్నికల్లో దక్కిన ఘోర పరాభవంతో చంద్రబాబు డైలమాలో పడిపోయారు. మిత్రులను దూరం చేసుకున్న కారణంగానే ఇంతటి ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నానన్న భావనలో ఉన్న చంద్రబాబు... ఈ తప్పు ఇకపై జరగరాదన్న కోణంలో లెక్కలేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి దగ్గరగా జరిగేందుకు వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్న చంద్రబాబు... పవన్ ను మచ్చిక చేసుకునే పనిని చాలా సైలెంట్ గానే మొదలెట్టేశారని చెప్పక తప్పదు.

ఇందులో భాగంగానే జనసేనాని బర్త్ డేను పురస్కరించుకుని అదిరిపోయే ట్వీట్ ను వదిలారు. సదరు ట్వీట్ లో చంద్రబాబు చేసిన కామెంట్లను చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం  వేయక మానదు. సరే... ఆ ట్వీట్ లో బాబు ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘తెలుగు సినీ నటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించి - విశిష్ట వ్యక్తిత్వంతో ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తోన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు శతాయుష్కులై సంపూర్ణ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’ అని ఆ ట్వీట్ లో చంద్రబాబు... పవన్ కు ఓ రేంజిలో గ్రీటింగ్స్ చెప్పారు. ఈ ట్వీట్ ను చూస్తుంటే... మరోమారు జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే... ఎన్నికలు ముగియగానే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరారు. వీరి చేరిక వెనుక కూడా చంద్రబాబు వ్యూహమే ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. చంద్రబాబుకు రైట్ - లెఫ్ట్ హ్యాండులుగా నిలిచిన సుజనా చౌదరి - సీఎం రమేశ్ లాంటి వారే బీజేపీలో చేరిన నేపథ్యంలోనే ఈ తరహా విశ్లేషణలు సాగుతున్నాయన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ మూడు పార్టీలో 2024 ఎన్నికల్లో కూడా కలిసికట్టుగానే పోటీ చేయడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News