మూడు ఊస్టింగ్‌లు... ఆరు పోస్టింగులు

Update: 2015-07-07 11:01 GMT
ఏపీ కేబినెట్‌ విస్తరణ త్వరలోనే ఉంటుందని సమాచారం. ఈ నెల 14 నుంచి ఉన్న పుష్కరాలు ముగిసిన తరువాత చంద్రబాబు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దృష్టిపెడతారు.  ఈ నెలాఖరుకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా జరగొచ్చని తెలుస్తోంది. అయితే.... కొత్త మంత్రులెవరు... పాతవారిలో ఎవరికి పదవీగండం ఉన్నది ఇంకా పూర్తిగా తేలలేదు. అయితే...ప్రస్తుత కేబినెట్లో ఉన్నవారిలో ముగ్గురికి ఉద్వాసన ఉంటుందని... ఆరుగురిని కొత్తగా చేర్చుకుంటారని చెబుతున్నారు.  మంత్రుల పనితీరు ఆధారంగా తక్కువ పెర్ఫార్మెన్సు ఉన్నవారికి ఉద్వాసన తప్పదని అంటున్నారు. దీనికి సంబంధించిన నివేదిక ఇప్పటికే చంద్రబాబుకు చేరింది కూడా. ఈ నివేదికను సీఎం కుమారుడు లోకేశ్‌ స్వయంగా తయారు చేయించారు. దీని ఆధారంగానే మార్పులు చేర్పులు ఉంటాయి.  ఇప్పటికే చంద్రబాబు దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

కొత్త మంత్రివర్గంలో ముస్లిం నేత అయిన ఎమ్మెల్సీ షరీఫ్‌ కు స్థానం ఖాయమని తెలుస్తోంది. అలాగే అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్‌... నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిల బెర్తులు ఖాయమని తెలుస్తోంది. తాజాగా మండలికి ఎన్నికైన మాగుంట శ్రీనివాసులరెడ్డిని తీసుకునే ఆలోచనా ఉంది. వీరితో పాటు తూర్పుగోదావరికి చెందిన తోట త్రిమూర్తులు... శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావెంకటరావు, విశాఖలో బండారు సత్యనారాయణమూర్తి, తూర్పులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెనాలి శ్రవన్‌ కుమార్ల పేర్లు వినిపిస్తున్నాయి.

    చేర్పుల సంగతి ఇలా ఉండగా ఉద్వాసనల విషయంలో మాత్రం ఎవరిపై వేటు పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. పరిటాల సునీత, కిమిడి మృణాళినిల్లో ఎవరో ఒకరి మంత్రిపదవి పోయే అవకాశాలున్నయి. మొత్తానికి ఇంకో రెండుమూడు వారాలు ఆగితే ఏం జరుగుతుందో తెలియనుంది.

Tags:    

Similar News