ఏపీ ఎమోష‌న్ల‌తో మోడీ-బాబు గేమ్స్‌

Update: 2018-08-02 14:23 GMT
ఏపీకి హ్యాండ్ ఇచ్చే విష‌యంలో ప్ర‌ధాని మోడీ ఫుల్ క్లారిటీతో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. విభ‌జ‌న హామీల విష‌యంపై బీజేపీ స‌ర్కారు అనుస‌రిస్తున్న రెండు నాల్కల ధోర‌ణిని తీవ్రంగా ప్ర‌శ్నిస్తోంది ఏపీ అధికార‌ప‌క్షం. మోడీ స‌ర్కారులో మిత్రుడిగా ఉన్నంత కాలం.. మోడీ త‌ప్పుడు నిర్ణ‌యాల్ని సైతం స‌మ‌ర్థించేలా వ్య‌వ‌హ‌రించిన తెలుగు త‌మ్ముళ్లు.. తాజా క‌టీఫ్ త‌ర్వాత నుంచి బీజేపీలోని దుర్మార్గాల‌న్నీ వారికి అదే ప‌నిగా క‌నిపిస్తున్నాయి.

విశాఖ‌ప‌ట్నం రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రం అనుస‌రిస్తున్న విధానాల‌పై తెలుగు త‌మ్ముళ్లు తాము ఏపీ కోస‌మే ప‌నిచేస్తున్న‌ట్లు ఎక్క‌డ టీవీ లైవ్ ఉన్నా ప్ర‌చారానికి వాడేస్తున్నారు. ఇక పార్ల‌మెంటులోనూ వారి తాప‌త్ర‌యం అదే. ప్ర‌చారంలో వీరికి మించిన ఘ‌నుడు మోడీ. అందుకే మీ తాప‌త్ర‌యాన్ని నేనెందుకు తీర్చాలి అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 కొద్ది రోజుల క్రితం రాజ్య‌స‌భ‌లో ఇదే అంశంపై మాట్లాడిన కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్.. జోన్ పై సానుకూల ప్ర‌క‌ట‌న ఉంద‌న్న మాట‌ను చెప్పారు. ఆ  త‌ర్వాత విభ‌జ‌న హామీల అమ‌లుపై సుప్రీంలో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లోరైల్వే జోన్ హామీ అమ‌లు సాధ్యం కాద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. తెలుగు బీజేపీ నేత జోన్ వ‌స్తుంద‌ని తాజాగా అన్నారు. బీజేపీ నోటికొచ్చిన‌ట్టు త‌న మాట‌ను తిప్పేస్తోంది. మొత్తానికి అటు తెలుగుదేశం -ఇటు బీజేపీ ... త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు త‌ప్ప ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో సంబంధ‌మే లేదు.

అందుకే ప్ర‌జ‌ల‌పై త‌మ క‌ప‌ట ప్రేమ‌ను టీడీపీ పార్ల‌మెంటులో ప్ల‌కార్డుల‌తో ప్ర‌ద‌ర్శిస్తే అంతే స్థాయిలో మోడీ వారిని ఇగ్నోర్ చేస్తూ త‌న రాజ‌కీయం తాను చేస్తున్నారు.

ఇప్ప‌టికి నాలుగేళ్లు గ‌డిచిపోయాయి.. ఇంకా స్పందించ‌రా? అంటూ గ‌ట్టిగా ఎంపీలు నిల‌దీసినా.. బీజేపీ నేత‌లు ఎవ‌రూ కిక్కురుమ‌న‌కుండా ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. ప్ర‌ధాని మోడీ సైతం స‌భ‌లో ఉండి ఆ మాట‌ల్ని ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టంపై టీడీపీ ఎంపీలు మండిప‌డుతున్నారు. ఇదిలాఉంటే.. ఇప్పుడు ఏడుస్తున్న ఏడుపు గ‌డిచిన నాలుగేళ్లుగా తెలుగు త‌మ్ముళ్లు ఏడ్చి ఉంటే ఎంతో కొంతప్ర‌యోజ‌నం ఉండేద‌న్న అభిప్రాయం ఏపీ ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. నాలుగేళ్లు మోడీతో చెట్టాప‌ట్టాలు వేసుకున్న వేళ‌.. రైల్వే జోన్ తో స‌హా ఇత‌ర కీల‌క హామీల‌పై నోరు విప్ప‌ని తెలుగు త‌మ్ముళ్లు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా గ‌ళం విప్ప‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదంటున్నారు. త‌మ ప్ర‌యోజ‌నాల‌కు భంగం వాటిల్ల‌కుండా ఉన్నంత కాలం మోడీ అండ్ కోను నెత్తిన పెట్టుకున్న తెలుగు త‌మ్ముళ్లు.. ఇప్పుడు అందుకు భిన్నంగా నిల‌దీసే కార్య‌క్ర‌మాన్ని చేప‌డితే.. అలాంటి ప‌రిస్థితిని డీల్ చేయ‌టం ఎలానో  మోడీ లాంటోడికి తెలీదా?
Tags:    

Similar News