బాబు సైబ‌ర్ నేర‌గాడే!... జ‌గ‌న్ తేల్చేశారు!

Update: 2019-03-06 15:53 GMT
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పెను వివాదానికి దారి తీస్తున్న డేటా చోరీ విష‌యంలో ఏపీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చాలా పక‌డ్బందీగా క‌దులుతున్నారు. టీడీపీ నేత‌ల మాదిరిగా ఏదో ట్విట్ట‌ర్‌ లోనే - మీడియా స‌మావేశాలు పెట్టి వైరి వ‌ర్గాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి స‌సేమిరా అంటున్న జ‌గ‌న్‌... ఈ వ్య‌వ‌హారంపై త‌న‌దైన మార్కు రాజ‌కీయంతో ముందుకు సాగుతున్నారు. డేటా చోరీలో కీల‌కంగా ఉన్న ఐటీ గ్రిడ్ కొన‌సాగించిన నిర్వాకం మొత్తం తెలుసుకున్న త‌ర్వాత నేటి మ‌ధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌రసింహ‌న్ తో భేటీ కోసం హైద‌రాబాద్ లోని రాజ్ భ‌వ‌న్‌ కు వెళ్లిన జ‌గ‌న్‌... మొత్తం వ్య‌వ‌హారాన్ని గ‌వ‌ర్న‌ర్‌ కు వివ‌రించారు. ఆ తర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్ అక్క‌డే మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిని సైబ‌ర్ నేర‌గాడిగా అభివర్ణించేసిన జ‌గ‌న్‌... ఓ సీఎంగా ఉండి ఇలా సైబ‌ర్ క్రైమ్ ల‌కు పాల్ప‌డే వ్య‌క్తిగా చంద్రబాబు రికార్డుల‌కెక్కార‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి సీఎంగా ఉన్న నేత రాష్ట్ర ప్ర‌జ‌లకు సంబంధించిన సున్నిత‌మైన స‌మాచారాన్ని కాపాడాల్సింది పోయి... త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం ఆ డేటాను ప్రైవేట్ కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టార‌ని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ దురాగ‌తాల‌కు వంత పాడిన ఐటీ గ్రిడ్ వద్ద ప్ర‌జ‌ల‌కు సంబంధించిన కీల‌క డేటా బ‌య‌ట‌ప‌డ‌ట‌మే ఇందుకు నిదర్శ‌న‌మ‌ని జ‌గ‌న్ ఆరోపించారు. చంద్ర‌బాబు మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో రెండేళ్లుగా ఐటీ గ్రిడ్ ప్ర‌జ‌ల డేటాను దొంగిలిస్తూనే ఉంద‌ని చెప్పిన జ‌గ‌న్‌.. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ లో ఉండకూడని డేటా ఉందని - ఆధార్ వంటి డేటా ఉందని చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద - ప్రైవేటు కంపెనీల వద్ద ఉండని సమాచారం సేవామిత్ర యాప్‌ లో ఉందని - ఇదే డేటా ఐటీ గ్రిడ్ కంపెనీలో దొరికిందని చెప్పారు. ఓ ప్రైవేటు కంపెనీ వద్ద ఈ సమాచారం ఎలా దొరుకుతుందో చెప్పాలని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

ఐటీ గ్రిడ్ లో ఆధార్‌ డేటాతో పాటు ఓటర్ల ఐడీ డేటా - కలర్ ఫోటోలతో సహా వస్తోందన్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజల అకౌంట్ల వివరాలు సేవామిత్రలో ఎందుకు ఉన్నాయని జ‌గ‌న్‌ ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ కంపెనీలో జ‌రిగిన‌ సోదాల్లో ఎన్నో ఆశ్చర్యకర వాస్తవాలు బయటకు వచ్చాయని చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్‌ క్రైమ్‌ కాదా అని జగన్ అన్నారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సైబర్‌ క్రైమ్‌ జరగలేదన్నారు. ఒక పద్ధతి - పథకం ప్రకారం చంద్రబాబు రెండేళ్ల నుంచే ప్రజల డేటాను చోరీ చేస్తున్నారన్నారు. రెండేళ్ల నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రక్రియను మేనేజ్‌ చేస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదని, చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలని సూచించారు. ప్రభుత్వమే ఇంటింటికి పంపించి - సర్వేలు చేయించి ఆ డేటాను సేవా మిత్రలో పొందుపరిచింద‌ని జగన్ చెప్పారు. ఓటరు ఏ పార్టీకి ఓటు వేస్తారనే అంశాన్ని సర్వే ద్వారా సేకరించారన్నారు. ఆ తర్వాత వారి ఓట్లను తొలగించే కుట్రకు తెరలేపారన్నారు.

టీడీపీకి ఓటు వేయరనే అనుమానం ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా - అనుకూలంగా ఉన్నవారి డూప్లికేట్‌ ఓట్లను నమోదు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో తాము కేవలం ఒక శాతం ఓట్లతో మాత్రమే ఓడిపోయామని - అంటే కేవలం 5 లక్షల ఓట్లతో మాత్రమే ఓడామని - కాబట్టి తాము ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. డూప్లికేట్ ఓట్లు భారీగా పెరిగినట్లు తాము గుర్తించామని చెప్పారు. డూప్లికేట్ ఓట్లపై గతంలోనే తాము ఫిర్యాదు చేశామని - ఈసీకి ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని, దీంతో మరోసారి ఫిర్యాదు చేశామన్నారు. ఈ తంతుపై తాము ఎన్నికల కమిషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుకు భయం ఎందుకని ప్రశ్నించారు. ఓ సీఎంగా ఇలా ఏపీ ప్రజల కీలక సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం సరికాదని - అసలు ముఖ్యమంత్రిగా ఉండేందుకు చంద్ర‌బాబు అర్హుడు కాదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

చంద్రబాబు చేయకూడని తప్పు చేస్తూ... నేరం తాను చేసి - ఆ త‌ప్పును ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య యుద్ధంగా చూపేందుకు య‌త్నిస్తున్నార‌ని జగన్ మండిపడ్డారు. తెలంగాణలో ఐటీ గ్రిడ్ కార్యాలయం ఉంది కాబట్టి, ఇక్కడే ఫిర్యాదు చేశామ‌న్నారు. దీనిని ఏపీ - తెలంగాణ మధ్య గొడవగా ఎలా చిత్రీక‌రిస్తారని కూడా జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఫాం 7 గురించి వివ‌రించిన జ‌గ‌న్‌... డూప్లికేట్ ఓట్లను గుర్తించాలనే ఫాం7ను పెట్టామని జగన్ చెప్పారు. మా వాళ్ల ఓట్లు తొలగించారని, దీనిపై విచారణ జరిపించాలని, విచారణ జరిగాక ఇందులో తప్పున్నాయని తెలిస్తే తీసేయమని చెప్పడమే ఫాం7 అన్నారు. ఫాం 7 అంటే మనం ఫైల్ చేయగానే వెంటనే ఓటును తీసివేయరని కూడా జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చారు. ఫాం 7 అంటే విచారణ కోరుకోవడం మాత్ర‌మేన‌ని కూడా జ‌గ‌న్‌ తెలిపారు.
Tags:    

Similar News