వ‌క్రీక‌ర‌ణ‌ల్లో బాబును మించిన వారు లేరంతే!

Update: 2018-07-01 11:10 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌లి కాలంలో త‌న‌దైన శైలి దుర్మార్గాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెప్ప‌డానికి... ఆయ‌న నోట నుంచి వెలువ‌డిన తాజా ప్ర‌క‌ట‌నే నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దొంగ దీక్ష‌లు చేస్తున్న త‌న అనుయాయుల‌ను మ‌హాత్ముల‌తో పోల్చి చెబుతుండ‌టం - అంతేకాకుండా త‌న అనుయాయుల దీక్ష‌లను ఆకాశానికెత్తే క్ర‌మంలో ఏకంగా మ‌హానీయుల త్యాగాల‌ను ప‌లుచ‌న చేసి మాట్లాడ‌టం - మ‌హ‌నీయుల దీక్ష‌ల‌కు సంబంధించి వ‌క్రీక‌ర‌ణ‌లు చేయ‌డం నిజంగా చంద్ర‌బాబుకే చెల్లింద‌న్న మాట వినిపిస్తోంది. త‌న కేబినెట్‌ లోకి దొడ్డిదారిన చ‌ట్ట స‌భ‌ల్లోకి వ‌చ్చి చేరిన త‌న త‌న‌యుడు నారా లోకేశ్... అనుభ‌వ రాహిత్యంతో చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు కామెడీల‌కే కామెడీగా మారిపోతే... ఇప్పుడు చంద్ర‌బాబు కూడా త‌న త‌న‌యుడికి ఏమాత్రం తీసిపోన‌న్న కోణంలో చేసిన ప్ర‌క‌ట‌న కామెడీని మించిపోయి ఏకంగా దారుణ వ‌క్రీక‌ర‌ణ‌గా మిగిలిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా చంద్ర‌బాబు చేసిన స‌ద‌రు దారుణ వక్రీక‌ర‌ణ ఏమంటే... మ‌ద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రజ‌ల‌కు ప్ర‌త్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్య‌మం చేసి ప్రాణత్యాగం చేసిన అమ‌ర‌జీవి పొట్టి శ్రీ‌రాములు ఏకంగా దీక్ష విర‌మించిన‌ట్లుగా చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

అది కూడా క‌డ‌ప ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ సీనియ‌ర్ నేత‌ - రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం రమేశ్ చేస్తున్న దీక్ష‌ను విర‌మింప‌జేసేందుకు నిన్న క‌డ‌ప‌కు వెళ్లిన చంద్రబాబు... ఈ దారుణ వ‌క్రీక‌ర‌ణ చేశారు. నిన్న క‌డ‌ప‌కు వెళ్లిన చంద్ర‌బాబు... సీఎం ర‌మేశ్ ఏదో సాధించిన‌ట్లుగా నిమ్మ‌ర‌సం ఇచ్చేసి ఆయ‌న చేత దీక్ష విర‌మింప‌జేశారు. కేంద్రం నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న రాకున్నా... త‌మ దీక్ష వ‌ల్ల ఏదో సాధించేశామ‌నే క‌ల‌రింగ్ ఇచ్చేసిన చంద్ర‌బాబు... కేంద్రం నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చాక సీఎం ర‌మేశ్ దీక్ష విర‌మించార‌ని చెప్పుకొచ్చారు. 10 రోజుల పాటు దీక్ష చేసినా... సీఎం ర‌మేశ్ ఏమాత్రం కుంగిపోకుండా చ‌లాకీ ఉన్న వైనంపై ఇప్ప‌టికే ఇటు విప‌క్ష నేత‌ల‌తో పాటు అటు సోష‌ల్ మీడియా వేద‌క‌గా సెటైర్లు పేలుతున్నాయి. లీట‌ర్ వాట‌ర్ బాటిల్ రూ.3000 ధ‌ర క‌లిగిన నీళ్ల‌ను తాగుతూ దీక్ష చేస్తే... ప‌ది రోజులేమిటి? ఏళ్ల త‌ర‌బ‌డి దీక్ష‌లు చేయొచ్చని ఇప్ప‌టికే చాలా సెటైర్లు పేలాయి. అయితే ఈ సెటైర్లు - విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని టీడీపీ... సీఎం ర‌మేశ్ తో ప‌ది రోజుల దీక్ష‌ను ఎలాగోలా నెట్టుకొచ్చింది. ప‌ది రోజుల పాటు దీక్ష చేస్తున్నా కేంద్రం నుంచి కించిత్ స్పంద‌న కూడా రాక‌పోవ‌డం - కేంద్రం నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డం... మొత్తం ప‌రిస్థితిని అంచ‌నా వేసిన చంద్ర‌బాబు... న‌యా ప్లాన్‌ కు తెర తీశారు.

ఉక్కు ఫ్యాక్టరీ ప్ర‌క‌ట‌న కోసం రెండు నెల‌లు వేచి చూస్తామ‌ని - అప్ప‌టికీ కేంద్రం ప్ర‌క‌ట‌న రాకుంటే తామే సొంతంగా ఏర్పాటు చేసుకుంటామంటూ బీరాలు ప‌లికారు. ఈ సంద‌ర్భంగా పొట్టి శ్రీ‌రాములు కూడా ప్ర‌త్యేక రాష్ట్రం కోసం దీక్ష కొన‌సాగిస్తూనే తుది శ్వాస విడిచారు. పొట్టి శ్రీ‌రాములు ఆమ‌ర‌ణ దీక్ష ఫ‌లితంగానే నాటి కేంద్ర ప్ర‌భుత్వం దిగొచ్చి తెలుగు మాట్లాడే ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక రాష్ట్ర వాద‌న స‌రైన‌దేన‌ని - మ‌ద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీక‌రించింది. జ‌రిగింది ఇది అయితే..చంద్ర‌బాబు మాత్రం కేంద్రం నుంచి నాడు ప్రక‌ట‌న రాగానే పొట్టి శ్రీ‌రాములు దీక్ష విర‌మించార‌ని - ఇప్పుడు సీఎం ర‌మేశ్ కూడా పొట్టి శ్రీ‌రాములు మాదిరే దీక్ష విర‌మిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. సీఎం ర‌మేశ్ దీక్ష‌ను ఆకాశానికెత్తేందుకు చంద్ర‌బాబు దుర్మార్గ‌మైన వ‌క్రీక‌ర‌ణ‌కు పాల్ప‌డ‌ట‌మే కాకుండా ఏకంగా పొట్టి శ్రీ‌రాములు ఆమ‌ర‌ణ దీక్ష‌ను అవ‌మానించే రీతిలో మాట్లాడార‌ని ప‌లు వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. స‌రే... బాబు చెప్పిన‌ట్టు పొట్టి శ్రీ‌రాములు కేంద్రం నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర్వాత దీక్ష విర‌మించార‌ని అనుకున్నా... మ‌రి నిన్న కేంద్రం నుంచి ఏ రక‌మైన ప్ర‌క‌ట‌న వ‌చ్చింద‌ని సీఎం ర‌మేశ్ తో దీక్ష విర‌మింప‌జేశారో ఆయ‌నే చెప్పాలి. మొత్తంగా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో కొట్టుమిట్టాడుతున్న త‌న పార్టీని ఎలాగోలా బ‌తికించుకునేందుకు ఏకంగా పొట్టి శ్రీ‌రాములు దీక్ష‌ను కూడా వ‌క్రీక‌రించేందుకు బాబు వెనుకాడ‌లేద‌న్న‌మాట‌. మొత్తంగా బాబు అత్యంత దుర్మార్గానికి పాల్ప‌డ్డార‌న్న మాట‌.

Tags:    

Similar News