కోతలు-కూతలు.. కాదు.. చేతలు కావాలి: కేటీఆర్ సెటైర్లు
వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతిని పురస్కరించుకుని `రైతు భరోసా` నిధులు విడుదల చేస్తామని కాంగ్రెస్ మంత్రులు చేసిన ప్రకటనపై తాజాగా ఆయన స్పందించారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెటర్లు కురిపించారు. కోతలు-కూతలు కాదు.. చేతలు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతిని పురస్కరించుకుని `రైతు భరోసా` నిధులు విడుదల చేస్తామని కాంగ్రెస్ మంత్రులు చేసిన ప్రకటనపై తాజాగా ఆయన స్పందించారు. ప్రకటనలతో రైతుల కష్టంతీరదని.. వారికి చేతలు కావాలని పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు చేసిన ప్రకటనలను కాంగ్రెస్ నాయకులు.. గుర్తు చేసుకోవాలని సూచించారు. తాము అధికారంలోకి రాగానే ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఏటా ఇస్తామని చెప్పారని, కానీ, ఏడాది గడిచిపోయినా.. రూపాయి కూడా రైతులకు అందలేదని.. అసలు ఈ ఊసే లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు నిధులను నిర్విఘ్నంగా అందించామని.. కానీ, కాంగ్రెస్ నేతలు దీనికి కూడా అనేక వంకలు పెట్టారని అన్నారు.
అయినా.. ఏడాదికాలంలో రైతు బంధు పథకంలో ఏం తప్పులు జరిగాయో కనిపెట్టలేకపోయారని అన్నా రు. రైతు బంధుపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అధికారం కోసం అబద్ధాలు చెప్పి.. ఇప్పుడు ఎగవేతల కోసం మాటలు చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు అన్నదాతలు.. సుఖంగా ఉన్నారని.. పచ్చని పంటలు పండించుకున్నారని తెలిపారు.
కానీ, ఇప్పుడు అప్పులు చేస్తూ.. ముప్పుతిప్పలుపడుతున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ గ్యారెంటీని కూడా.. ఈ ప్రభుత్వంఅమలు చేయడం లేదని, ఇది గ్యారెంటీ లేని ప్రభుత్వమని కేటీఆర్ విమర్శించారు. అమ్మలను మోసం చేశారని.. ఇప్పుడు అన్నదాతలను కూడా మోసం చేస్తున్నారని అన్నారు.