కేంద్ర బడ్జెట్‌పై షర్మిల రియాక్షన్.. ఏమన్నారంటే!
మొత్తంగా చూస్తే.. దేశవ్యాప్తంగా వికసిత భారత్ ఫలాలను అందించే బడ్జెట్‌గానే ఉందన్న చర్చ సాగు తోంది.
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తాజాగా శనివారం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై సర్వత్రా ప్రశంసలు.. అదే సమయం లో కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. పెట్టుబడులకు, కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చా రు. రైతులకు కూడా రుణాల పరపతిని పెంచారు. పేదలకు ఇళ్లు, మహిళలకు సొంతగా ఉపాధి కల్పించేందుకు ఈ బడ్జెట్ ఎంతో కృషి చేసిందని నిపుణులు చెబుతున్నారు. ఇక, రాష్ట్రాల పరిధిలో చూసుకుంటే.. బిహార్‌కు భారీగా, అసాం, ఏపీలకు పాక్షికంగా ప్రయోజనాలు చేకూరాయి. మొత్తంగా చూస్తే.. దేశవ్యాప్తంగా వికసిత భారత్ ఫలాలను అందించే బడ్జెట్‌గానే ఉందన్న చర్చ సాగు తోంది.
తాజాగా ఈ బడ్జెట్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వై ఎస్ షర్మిల తనదైన రీతిలో స్పందించారు. బీహార్‌కి 'ఫుల్', ఏపీకి 'నిల్' అని వ్యాఖ్యా నించారు. ఇది భారత్ బడ్జెట్ కాదు. బీహార్ ఎన్నికల బడ్జెట్ అని అన్నారు.''మోడీ గారి బీహార్ ఎన్నికల బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లుందన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలు ఉన్న నితీష్ కుమార్ .. బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే.. 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబుకు మోడీ చిప్ప చేతిలో పెట్టారు'' అని షర్మిల వ్యాఖ్యానించారు. బీహార్‌ను అందలం ఎక్కించి, ఆంధ్రకు గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని షర్మిల వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల మద్దతుతో గద్దెనెక్కి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. బడ్జెట్‌లో ఈ సారి కూడా హోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీశారన్నారు. రాజ ధాని అమరావతికి గతంలో ఇచ్చిన రుణం తప్ప.. ఇప్పుడు రూపాయి సహాయం ఇవ్వలేదన్నారు. పోలవరం అంచనాలకు ఆమోదం అన్నారే కానీ బడ్జెట్‌లో ఆశించిన ఫలితం లేదని ఎద్దేవా చేశారు. విభజన హామీలను తుంగలో తొక్కారన్న షర్మిల.. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక పరిశ్రమలు కేటాయించలేదని షర్మిల వ్యాఖ్యానించారు.
''మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టించుకోలేదు. కడప స్టీల్ ఊసే లేదు. రాష్ట్రాలకు సర్వసాధారణంగా ఇచ్చే అరకొర కేటాయింపులు, విదిలింపులే తప్ప ఏపీకి ఉపయోగపడే ప్రాజెక్టును ఒక్కటైనా ప్రకటించలేదు. అవసరం ఉన్నంత సేపు ఓడమల్లన్న... గట్టెక్కాక బోడి మల్లన్న.. రాష్ట్ర ప్రజలను మోడీ బోడి మల్లన్న కింద లెక్క గట్టారు. కూటమి నిస్సహాయత, ఏపీపై కేంద్రానికి ఉన్న ఉదాసీనత ఈ బడ్జెట్‌తో తేటతెల్లం అయ్యింది. ఇంత అన్యాయం జరిగితే చంద్రబాబు బడ్జెట్‌ను ప్రగతిశీల బడ్జెట్ అని స్వాగతించడం హాస్యాస్పదం'' అని షర్మిల వ్యాఖ్యానించారు.