బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న సుజ‌నా కోస‌మా?

Update: 2016-07-02 06:00 GMT
కేంద్ర శాస్త్ర - సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరిని కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించ‌నున్నారా? ఈ నిర్ణ‌యాన్ని అడ్డుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత చంద్రబాబు ప్ర‌య‌త్నం చేస్తున్నారా?  చైనా ప‌ర్య‌ట‌న నుంచి వ‌స్తునే ఢిల్లీలో ప‌లువురు మంత్రుల‌ను బాబు క‌ల‌వ‌డం వెనుక ఎజెండా ఇదేనా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

ఢిల్లీలో జ‌రుగుతున్న ప్రచారం ప్ర‌కారం మారిషస్‌ బ్యాంకు అప్పులు చెల్లించకుండా ఎగ్గొట్టిన చౌదరిపై కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ వారంలో జరగబోయే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చౌదరిని తొలగించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు టాక్‌. ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేయాల‌నే వార్త‌లు తెలుసుకున్న చంద్ర‌బాబు సుజ‌నానే కొన‌సాగించాల‌ని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని కోరినట్లు సమాచారం. ఇదిలాఉండ‌గా ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోం - ఆర్థిక - జలవనరుల మంత్రులతో భేటీ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన వివరాలను సుజనా చౌదరి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో భేటీ అయిన చంద్రబాబు విభజన చట్టంలో పేర్కొన్న పెండింగ్‌ అంశాలపై చర్చించారని తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధికారిక అంశాలు గురించి చర్చ ఏమీ లేదన్నారు.

కృష్ణా నదీ జలాల పంపకాలపై చర్చించేందుకు ఉమా భారతి - తన మంత్రిత్వ శాఖ కార్యదర్శిని పిలిపించారు. కానీ చంద్రబాబు కేవలం పరామర్శకే వచ్చానని, అధికారిక అంశాలు చర్చించబోనని తెలిపారు. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ ఛార్జి సిద్ధార్థానాథ్‌ సింగ్‌ తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులు - టీడీపీ-బీజేపీల మధ్య‌ సఖ్యత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సిద్ధార్థానాథ్‌ మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ కి కేంద్రం ఏం చేయ్యాలో తెలుసని, రెండేళ్లలో ఏన్నో చేశామని, భవిష్యత్‌ లో కొనసాగిస్తామని అన్నారు.
Tags:    

Similar News