పనికి మేధా.. ఉండేందుకు రెయిన్ ట్రీ

Update: 2015-11-03 04:52 GMT
ఏపీ సర్కారుకు సంబంధించి అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి మొదలు.. మంత్రుల వరకూ అందరూ బెజవాడకు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి. దీనికి భిన్నంగా ఏపీ పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయం మాత్రం హైదరాబాద్ లోనే ఉండిపోయింది. సచివాలయంలో పని చేసే ఏపీ ఉద్యోగులు హైదరాబాద్ ను వదిలి వెళ్లేందుకు చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాము హైదరాబాద్ నుంచి రాజధానికి వస్తే పని ఎక్కడ చేయాలన్నది వారిప్రాధమిక ప్రశ్న. ఇక.. తమ బస సంగతేమిటన్నది మరోప్రశ్న.

ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది ఏపీ సర్కారు. ఏపీ సచివాలయ ఉద్యోగులకు పని చేసే ప్లేస్ ను డిసైడ్ చేయటంతో పాటు.. వారికి నివాసం కల్పించేందుకు కొంత మేర కసరత్తు చేసి అందరికి కాకున్నా కొందరికి నివాస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది కూడా 2016మార్చిలోపు ఏపీకి వచ్చేసే సచివాలయ ఉద్యోగులకు తాత్కలిక వసతి కల్పించాలని నిర్ణయించారు.

పనికి సంబంధించి పెద్ద సమస్యలు లేవని ఏపీ సర్కారు చెబుతోంది. ప్రభుత్వ కార్యాలయాల కోసం గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న మేదా టవర్స్ లో అందుబాటులో ఉన్న 1.75లక్షల చదరపు అడుగుల స్థలాన్ని వినియోగించుకోవాలని క్యాబినెట్ సమావేశం తాజాగా నిర్ణయించింది. దీంతో.. సచివాలయానికి సంబంధించిన సమస్య దాదాపుగా తొలిగిపోయినట్లేనని చెబుతున్నారు.

అదే సమయంలో విజయవాడలోని ఆర్ అండ్ బీ అధీనంలో ఉన్న 1.5ఎకరాల స్థలంలో నాలుగు నెలల కాలంలో 1.5లక్షల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దీంతో.. ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి సమస్యలు తీరుతాయని అంచనా వేస్తున్నారు. ఇంకా అవసరం అనుకుంటే.. గుంటూరులోని కొన్ని భవనాల్లోకి కొన్ని శాఖల్ని తరలించాలని నిర్ణయించారు. పలు శాఖలకు సంబంధించిన కార్యాలయాలకు అవసరమైన భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి.. వాటిని పరిశీలించి.. ఎవరు అడిగితే వారికి వీలుగా ఉండే ప్రాంతాల్ని సూచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

ఇక.. హైదరాబాద్ నుంచి వచ్చే వారికి.. మంత్రులకు అవసరమైన నివాసాల కోసం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్కులో ఖాళీగా ఉన్న అపార్ట్ మెంట్లను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ భవనాలను మూడు విభాగాలు తీసుకోనున్నారు. నెలకు రూ.10.. 11.. 13 వేల చొప్పున అద్దెకు తీసుకొని.. వాటిని ఉద్యోగులు.. అధికారుల వసతి కోసం తీసుకోనున్నారు. రాజధానికి వచ్చే ఉద్యోగులు.. అధికారుల అవసరాలకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు.. నివాసాలపై నెలకొన్న సందేహాలకు తాజాగా సమాధానాలు దొరికినట్లుగా చెప్పొచ్చు.
Tags:    

Similar News