బాబు ప‌ద‌వులు ఇచ్చేది ఈ రెండింటికేనా?

Update: 2017-12-30 09:34 GMT
తొమ్మిదిన్న‌రేళ్లు సీఎంగా ఉమ్మ‌డి రాష్ట్రాన్ని ఏలిన చంద్ర‌బాబు.. ఆ త‌ర్వాత ప‌దేళ్లు నాన్ స్టాప్ గా ప్ర‌తిప‌క్షంలో ఉన్న వేళ‌.. ఆయ‌న చాలానే మాట‌లు చెప్పేవారు. తాను ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు ప‌ద‌వులు ఇచ్చిన వారు.. కాల క్ర‌మంలో పార్టీ నుంచి జంప్ అయిపోయారు. మ‌రికొంద‌రు త‌మ వ్యాపారాల్లో బిజీబిజీగా ఉండిపోయారు. ఇంకొంద‌రైతే.. నాటి అధికార‌ప‌క్షంతో చేతులు క‌లిపి.. అధికార‌పక్ష నేత‌ల‌తో క‌లిసి జాయింట్ వెంచ‌ర్లు చేసినోళ్లు ఉన్నారు.

ఇలా అగ్ర‌శ్రేణి నాయ‌క‌త్వ‌మంతా ఏదో ర‌కంగా కాలం గ‌డిపేశారు. ఆర్థికంగా వారికి ఇబ్బంది లేకుండా బండి లాగించేశారు. కానీ.. ఆర్థికంగా అంత సౌండ్ గా లేకున్నా.. పార్టీ అంటే పిచ్చిగా ప్రేమించే కొంద‌రు ద్వితీయ శ్రేణి నేత‌లు.. బాబు మ‌ళ్లీ సీఎం కావాల‌ని తెగ త‌పించేవారు. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధ‌మంటూ ఫ్యామిలీల‌ను వ‌దిలేసి మ‌రీ పార్టీ కోసం తిరిగేవారు.

త‌న‌కు ప‌రిచ‌య‌స్తులు.. క్లోజ్ గా ఉండే నేత‌ల్లో కొంద‌రు ముఖం చాటేస్తే.. మ‌రికొంద‌రు బాబు చేత బ‌తిమిలాడించుకునే వ‌ర‌కూ వెళ్లారు. అలాంటి వేళ‌.. త‌న స‌న్నిహితుల‌తో బాబు కొన్ని మాట‌లు చెప్పే వార‌ని చెబుతారు. తాను మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే.. పార్టీ కోసం నిజంగా క‌ష్ట‌ప‌డే వారికి.. పార్టీ కార‌ణంగా దెబ్బ తిన్న వారికి పెద్ద‌పీట వేస్తాన‌ని.. ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టం ఎంత క‌ష్ట‌మ‌న్న విష‌యం అర్థం కావ‌టంతో పాటు.. పార్టీకి నిజంగా శ్ర‌మించే వారు ఎవ‌ర‌న్న విష‌యం తెలిసింద‌న్న మాట‌ల్ని చెబుతుండేవార‌ని చెబుతారు.

బాబు కోరుకున్న‌ట్లే ప‌వ‌ర్ లోకి వ‌చ్చేశారు. అధికారం చేతికి వ‌చ్చి దాదాపు మూడున్న‌రేళ్లు పూర్తి అయ్యింది కూడా. మ‌రి.. ఇంత కాలంలో బాబు గ‌తంలో తాను చెప్పిన మాట‌ల మీద నిల‌బ‌డ్డారా? అంటే లేద‌ని చెప్పాలి. కొన్ని ప‌ద‌వుల విష‌యంలో త‌న‌ను న‌మ్ముకున్న వారిని వ‌దిలేసి.. గ‌తంలో త‌న‌కు హ్యాండిచ్చిన వారికే పెద్ద‌పీట వేశార‌ని చెప్పాలి.

ఎవ‌రిదాకానో ఎందుకు భూమా ఫ్యామిలీనే చూడండి. వారు మొద‌ట్లో తెలుగుదేశంలో ఉండి.. పార్టీ ప‌వ‌ర్ లో లేని వేళ‌.. తొలుత ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త‌ర్వాతి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

వారికి పెద్ద‌పీట వేసి.. కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఇచ్చినా.. ప‌వ‌ర్ లేని కార‌ణంగా ఆయ‌న్ను వ‌దిలేసి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మ‌రిన్నిసార్లు హ్యాండిచ్చిన భూమా ఫ్యామిలీకి ప‌ద‌వులు ఇచ్చే వేళ‌కు భూమానాగిరెడ్డి మ‌ర‌ణించ‌టంతో.. ఆయ‌న కుమార్తె భూమా అఖిల‌ప్రియ‌ను మంత్రిని చేశారు. భూమా ఎపిసోడ్ ను అరుదైన ఉదంతంగా వ‌దిలేద్దామ‌ని అనుకుంటే.. క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంక‌టేశ్ ఉదంత‌మే తీసుకుందాం.

2004లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిన ఆయ‌న‌.. త‌ర్వాతి కాలంలో ప‌వ‌ర్ లేని బాబు ద‌గ్గ‌ర ఉండ‌లేక కాంగ్రెస్ కు వెళ్లిపోయారు. 2009లో కాంగ్రెస్ టికెట్ మీద విజ‌యం సాధించిన ఆయ‌న‌.. రోశ‌య్య కోటాలో ఏకంగా మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు.

విభ‌జ‌న ఉద్య‌మం జ‌రుగుతున్న వేళ‌.. అప్పుడ‌ప్పుడు వెనుకా ముందు చూసుకోకుండా చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ ప్ర‌జ‌ల్లో మ‌రింత ప‌ట్టుద‌ల పెంచి.. ఏపీకి భారీ న‌ష్టం వాటిల్లేలా చేశారు. స‌రే.. ఆయ‌న‌కు తోచింది చేశార‌ని అనుకుంటే.. క‌నీసం విభ‌జ‌న వేళ గొంతెత్తి గ‌ట్టిగా మాట్లాడారా? అంటే అదీ లేదు. నిలువెత్తు స్వార్థంతో.. త‌న వ్యాపార ప్ర‌యోజ‌నాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డార‌ని చెబుతారు. ఆ పెద్ద మ‌నిషి.. విభ‌జ‌న వేళ మ‌ళ్లీ టీడీపీలోకి చేర‌టం.. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవ‌టం జ‌రిగిపోయింది.

అయినప్ప‌టికీ ఆయ‌న‌కున్న ఆర్థిక ప‌వ‌ర్ పుణ్య‌మా అని.. బాబు రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. టీడీపీ ప‌వ‌ర్ లో లేని వేళ ఏ మాత్రం అండ‌గా నిల‌వ‌ని టీజీకి.. అదీ ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇచ్చినా ప్ర‌జామోదంతో విజ‌యం సాధించ‌ని ఆయ‌న్ను ఏకంగా రాజ్య‌స‌భ‌కు పంప‌టం చూస్తే.. బాబు ప్రాధాన్య‌త ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

తాజాగా క‌ర్నూలు జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని.. ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు.. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కేఈ ప్ర‌భాక‌ర్ కు ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. ప‌లు వివాదాల్లో భాగం ఉంద‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొనే కేఈ ప్ర‌భాక‌ర్ కు ఎమ్మెల్సీ సీటు కేటాయించ‌టం చూస్తే.. బాబు తీరు ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. బాబు చేతుల‌తో ప‌ద‌వులు ఇవ్వాలంటే అయితే.. ఆర్థికంగా సంప‌న్నుడైనా ఉండాలి.. లేదంటే త‌న‌కు అయిన‌వాళ్లు అయినా ఉండాల‌న్న ధోర‌ణి చంద్ర‌బాబులో క‌నిపిస్తుంది. ప‌వ‌ర్ లో లేన‌ప్పుడు.. పార్టీకి అండ‌గా నిలిచిన వారికి తోడు ఉంటాన‌ని.. ప‌ద‌వుల‌తో వారి ముఖాల్లో చిరున‌వ్వులు పూయిస్తాన‌ని చెప్పే మాటల్లో నిజం ఏ మాత్రం లేద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.


Tags:    

Similar News