అచ్చెన్న‌పై బాబు ఎందుకంత ఫైర‌య్యారు?

Update: 2016-01-26 07:01 GMT
కింజార‌పు అచ్చెన్నాయుడు...ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్మిక శాఖా మంత్రి. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో క్రియాశీలంగా క‌నిపించే మంత్రుల్లో అచ్చెన్నాయుడు టాప్‌ లో నిలుస్తారు. ప్ర‌భుత్వాన్ని వెన‌కేసుకొని రావ‌డం, ప్ర‌తిపక్షాల‌పై దాడిచేయ‌డం, చంద్ర‌బాబు చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించ‌డం..ఈ అంశాల‌ల్లో సంద‌ర్భం ఏదైనా అచ్చెన్నాయుడు ముందుంటారు. అసెంబ్లీ స‌మావేశాల్లో అయితే మైక్ దొరికిందంటే ఆయ‌న వాగ్దాటిని భ‌రించ‌డం క‌ష్టం. అలాంటి అచ్చెన్నాయుడుపై ఏపీ సీఎం, పార్టీ అధినేత చంద్ర‌బాబు ఫైర‌య్యారు. అది కూడా అలా..ఇలా కాదు ఏకంగా కేబినెట్ మీటింగ్‌ లోనే కావ‌డం విశేషం.

ప్ర‌భుత్వంలో, ముఖ్య‌మంత్రి వ‌ద్ద త‌న‌కు ద‌క్కిన ప్రాధాన్య‌త ఆధారంగా అచ్చెన్నాయుడు త‌న సొంత‌శైలి అయిన దూకుడును మించి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ప‌రిణామం చంద్ర‌బాబు నాయుడుకు ఒకింత ఇబ్బందిగా మారింది. పైగా కేబినెట్ స‌మావేశంలోనే ఇత‌ర మంత్రులంతా రాష్ట్రంలోని రోడ్లు బాగున్నాయ‌ని కితాబిస్తే...అచ్చెన్నాయుడు మాత్రం అస్స‌లు బాగాలేవ‌ని వ్య‌తిరేకించారు. దీంతో అచ్చెన్నాయుడుకు క్లాస్ తీసుకునేందుకు కేబినెట్ స‌మావేశ‌మే స‌రైన వేదిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు. "అచ్చెన్నాయుడు గారు...వివిధ శాఖలపై తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ తీరు స‌రికాదు. ముందు మీ శాఖ‌పై దృష్టిపెట్టండి" అంటూ చంద్ర‌బాబు ఘాటుగా మందలించినట్లు తెలిసింది.మంత్రులంద‌రి సాక్షిగా ముఖ్య‌మంత్రి క్లాస్ తీసుకోవ‌డంతో అచ్చెన్నాయుడు ఒకింత ఖంగు తిన్నారు.

ఇదిలాఉండ‌గా రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా చంద్రన్న కానుకల పంపిణీలో నాసిరకం సరుకులు చోటుచేసుకున్నాయనే అభియోగంతో ప్రభుత్వం పరువు పోయిందని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి ప‌రిటాల సునిత‌పై సైతం చంద్ర‌బాబు మండిప‌డ్డారు. పౌసరఫరాల శాఖ ఇంత స‌మన్వ‌యం లేకుండా ఎలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News