బాబు క్లారిటీః బీజేపీపై దూకుడే

Update: 2016-03-15 17:20 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ హితోప‌దేశం చేశారు. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన టీడీఎల్‌ పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీతో పాటు మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీతో వ్య‌వ‌హ‌రించ‌డంపై సూచ‌న‌లు చేశారు. సభలో ప్రతిపక్షం రెచ్చగొట్టినా సంయమనం కోల్పోవద్దని చంద్రబాబునాయుడు పార్టీ సభ్యులకు సూచించారు. ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా ప్రజలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని అన్నారు. బడ్జెట్‌ పై చర్చ సమయంలో పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. బుధవారం జరిగే సమావేశాల్లో విభజన హామీల అంశం సభ ఎజెండాలో పెట్టాలని ప్రతిపాదించారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేస్తున్న సాయానికి అభినందనలు తెలుపుతూ సభలో తీర్మానం చేయాలని నిర్ణయించారు.

సొంత పార్టీ వారైనా అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని చంద్ర‌బాబు నాయుడు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు. పోలవరంపై బీజేపీ నేతల విమర్శలను తిప్పి కొట్టాలని ఆయ‌న సూచించారు. 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. పోలవరం పూర్తి చేస్తామంటే...బాధ్యతలు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం కాపులు, బీసీలకు సమన్యాయం చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన సంస్థ‌ల విష‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ఎండ‌గ‌ట్టాల‌ని చంద్ర‌బాబు ఈ స‌మావేశంలో సూచించారు.
Tags:    

Similar News