అది కలెక్టర్ల మీటింగా.. కేసీఆర్ వ్యతిరేక సభా?

Update: 2018-01-19 07:52 GMT
ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై మండిపడుతున్నారు. ఆంధ్ర పాలకులు తెలంగాణను ధ్వంసం చేశారని కేసీఆర్ అనడంపై ఐఏఎస్‌ లు ఆగ్రహిస్తున్నారు. అయితే, రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో ఐఏఎస్‌ లు ఎందుకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారన్నదే అసలు ప్రశ్న. ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశంలో పలువురు ఐఏఎస్‌లు కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
    
కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ - కేసీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయని అన్నారు. ఆ తరువాత ఉన్నతాధికారులు - కలెక్టర్ల ప్రసంగాలు ప్రారంభం కాగా - ప్రతి ఒక్కరూ కేసీఆర్ ను ప్రస్తావిస్తూ - ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పడం - ఖండించడం మొదలుపెట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలపై సీనియర్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందిస్తూ కేసీఆర్ ఇంకా బురద జల్లుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ను ఏపీ పాలకులు నిర్లక్ష్యం చేశారన్న వ్యాఖ్యలను గుర్తు చేసిన ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య - ఇరవై సంవత్సరాలకు ముందు - ఆ తరువాత హైదరాబాద్ ఎలా ఉందో ఓసారి పరిశీలించి - ఆపై మాట్లాడాలని సూచించారు. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లయిన తరువాత కూడా ఈ తరహా విమర్శలు ఏంటని పలువురు కలెక్టర్లు ప్రశ్నించారు.
    
రాష్ర్టంలో పాలనకు సంబంధించి చర్చించడానికి ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో ఇలా రాజకీయ అంశాలపై చర్చించడం.. పొరుగు రాష్ర్ట సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించడం అవసరమా అన్న ప్రశ్న వినిపిస్తోంది. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి - ఆయనకు నచ్చేలా మాట్లాడడం కోసం కలెక్టర్లంతా ఈ అంశాన్ని ఎత్తుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తీరే ఇలా కలెక్టర్లు తమకు సంబంధం లేని అంశాలపై స్పందించేలా చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News