దేశంలోనే సీనియ‌ర్‌ ను అంటున్న బాబు

Update: 2017-06-05 17:00 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. నవనిర్మాణ దీక్ష నాలుగో రోజు సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు మాట్లాడుతూ దేశంలో తను సీనియర్‌ నాయకుడినని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేశారు. ఏపీకి నిధులు కావాలని, అందుకే కేంద్రాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. ఈ విష‌యంపై కొందరు ప‌నిగ‌ట్టుకొని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని సీఎం చంద్రబాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ప్రత్యేక హోదా కోసం గ‌ళం విప్పుతున్న వారు ప్రత్యేక హోదాతో ఏం వస్తాయో చెప్పాలని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజీ మధ్య వ్యత్యాసం ఏమిటో చెప్పాలని కోరారు. హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజన చేశారని చంద్రబాబునాయుడు అన్నారు. మన తలసరి ఆదాయం తక్కువ ఉండేందుకు కాంగ్రెస్‌ పార్టీ కారణమని ఆరోపించారు. పైగా ఏపీలో స‌భ నిర్వ‌హించిన కాంగ్రెస్ త‌మ త‌ప్పిదానికి ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు విపక్షాల కుట్ర చేస్తున్నాయని చంద్ర‌బాబు ఆరోపించారు.

2018నాటికి పోలవరం ద్వారా నీరు విడుదల చేస్తామని న‌వ నిర్మాణ దీక్ష సంద‌ర్భంగా చంద్ర‌బాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌ల సంక్షేమం కోసం  ఉచితంగా ఇసుక ఇస్తున్నామని చెప్పారు. అకాల విప‌త్తుల నుంచి కాపాడుకునే క్ర‌మంలో భాగంగా  పిడుగుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో సహాయంతో యాప్‌ రూపొందించామని వెల్లడించారు. ఇలా ప‌లు ర‌కాల సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ ముందుకు సాగుతుంటే విప‌క్షాలు ప‌నిగ‌ట్టుకొని విమ‌ర్శిస్తున్నాయ‌ని చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News