త‌మ్ముళ్లే ప‌రువు తీస్తున్నారు: బాబు

Update: 2017-12-01 11:55 GMT

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం మ‌రోమారు హాట్ హాట్‌ గా సాగింది. ఈ సమావేశంలో పోలవరం-కేంద్రం - ఇంటింటికి టీడీపీ - అసెంబ్లి సమావేశాలు - సభ్యుల పనితీరు వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో స్పందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కరణం బలరాం - గొట్టిపాటి రవికుమార్‌ మరోసారి బాహాబాహీకి దిగ‌డంపై సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీ ప‌రువు తీస్తున్నారంటూ మండిప‌డ్డారు. తాను ఎవ‌రికీ అన్యాయం చేయ‌లేదని, కొత్త‌-పాత క‌లిసి ప‌నిచేయాల‌ని ఎన్నోసార్లు చెప్పాన‌ని బాబు పార్టీ నేత‌ల వద్ద వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల‌కు ఇన్ ఛార్జిలుగా బాధ్య‌త‌లు ఇచ్చాక జోక్యం వ‌ద్ద‌ని కూడా చెప్పాన‌ని అన్నారు. చేరిక‌ల వ‌ల్ల పార్టీలో ఉన్న‌వారికి అన్యాయం జ‌ర‌గ‌కుండా చూశామ‌ని - పార్టీలో ఉన్న‌వారికి ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇచ్చి గౌర‌వించామ‌ని గుర్తు చేశారు. అయినా గొడ‌వ‌లు ప‌డుతూ పార్టీకి చెడ్డ‌పేరు తెస్తున్నారన్న చంద్ర‌బాబు.. ఇలాంటి చ‌ర్య‌లు ఇక‌పై ఉపేక్షించ‌నని హెచ్చ‌రించారు.

సంస్కరణలు వచ్చాక ప్రజల ఆలోచనా విధానం మారిందని, దానికి అనుగుణంగా రాజకీయ విధానం మారాలని సీఎం చంద్రబాబు కోరారు. తాను రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ చేస్తుంటే ఎమ్మెల్యేలు రియల్‌ టైమ్‌ పాలిటిక్స్‌ చేయాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేస్తే అధికారం సుదీర్ఘంగా ఉంటుందని సీఎం తెలిపారు. కమ్యూనిస్ట్‌ పార్టీల వల్ల వ‌చ్చేదేమీ ఉండ‌దన్నారు. పోలవరం విషయంలో కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పోలవరం అభివృద్ధితో కూడిన అంశమని - రాజకీయ కోణంలో ఆలోచించవద్దని మంత్రులకు - ఎమ్మెల్యేలకు సూచించారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వం మనకు సాయం చేయాలని, అభివృద్ధి జరిగే వరకు కేంద్ర సాయం కోరాలన్నారు. కేంద్రంపై విమర్శలు చేసేసి ఏదో ఒకటి మాట్లాడొద్దని సీఎం పేర్కొన్నారు.

పోలవరం నిర్మాణంపై ప్రతివారం సమీక్ష చేస్తున్నామని, ఏమాత్రం అలక్ష్యం వహించినా నిర్మాణం వెనుకబడుతుందని సీఎం చంద్ర‌బాబు వివరించారు. ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అంటే కోపమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఎంపీ జేసీతో వివాదాలను ప్రస్తావించారు. ప్రైవేట్‌ రంగంలో మెడికల్‌ కాలేజీలకు నాకు నిర్ణయం తీసుకుంటే ఎంపీ జేసీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారన్నారు. అందుకే జేసీ కోపమని సీఎం వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధిపై నిర్మొహమాటంగా ప్రశ్నించిన ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని సమస్యలపై మంత్రులను గట్టిగా ప్రశ్నించారన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరిగాయని సీఎం పేర్కొన్నారు.
Tags:    

Similar News