బాబు..చివ‌ర‌కు కేటీఆర్ ను ఫాలో అయ్యారు!

Update: 2018-06-30 11:32 GMT
రాజ‌కీయ రంగంలో ఉన్న వారికి.. సెల‌బ్రిటీల‌కు ఉన్న సౌల‌భ్యం ఏమిటంటే.. వారిని నిత్యం ఎవ‌రో ఒక‌రు పొగిడేస్తుంటారు. నిజానికి వారికి అదే పెద్ద ఎన‌ర్జీ డ్రింక్ గా ప‌ని చేస్తూ ఉంటుంది. నిత్యం పొగ‌డ్త‌లతో మునిగి తేల‌టంతో పాటు.. అభిమానించి..ఆరాధించే గ‌ణం చుట్టూ ఉంటూ వాతావ‌ర‌ణాన్ని సంద‌డి సంద‌డిగా మార్చేస్తుంటారు. ఇంత ఉన్నా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు భారీ కొర‌త ఒక‌టి ప‌ట్టి పీడిస్తూ ఉంటుంది. ఆయ‌న్ను ఎవ‌రు పొగిడినా అంత సంతృప్తి ఉండ‌దు. త‌న‌ను తాను పొగుడుకుంటే కానీ ఆయ‌న‌కు తృప్తి తీర‌దు.

అందుకే. .అదే ప‌నిగా త‌న‌ను తాను పొగిడేసుకోవటం.. గొప్ప‌లు చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. దేశంలోనే త‌న‌కు మించిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్ లేర‌ని.. అప్పుడెప్పుడో కేంద్రంలో చ‌క్రం తిప్పాన‌ని.. హైద‌రాబాద్ ను నిర్మించాన‌ని.. ఇలా చాలానే గొప్ప‌లు చెప్పుకుంటారు.

మ‌రింత‌. రాజ‌కీయ‌.. పాల‌నా అనుభ‌వం ఉన్న పెద్ద మ‌నిషి ఐడియాలు ఎలా ఉండాలి?  విజ‌న్ మ‌రెలా ఉండాలి?  క‌డ‌ప‌లో ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి బాబు నోటి నుంచి వ‌చ్చే మాట‌ల‌కు కేంద్రం డంగై పోవ‌ట‌మే కాదు.. డిఫెన్స్ లో ప‌డేట‌ట్లు ఉండాలి. కానీ.. బాబు వ్య‌వ‌హారం చూస్తే ఇలాంటివేమీ క‌నిపించ‌వు. ఏపీలోని క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మను ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ఉందో.. తెలంగాణ‌లోనూ బ‌య్యారంలో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉంది.

ఈ మ‌ధ్య‌న క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ మీద దీక్ష మొద‌లెట్టిన టీడీపీ నేత హ‌డావుడి చేస్తున్న వేళ‌.. తామేమీ త‌క్కువ తిన‌లేద‌న్న‌ట్లుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఏకంగా ప్ర‌ధాని మోడీ అపాయింట్ మెంట్ తీసేసుకొని.. బ‌య్యారంలో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటుకున్న ఫీజుబులిటీస్ ను మాట్లాడి.. మీరు కానీ ఓకే అంటే.. ప్రాజెక్టుకు అయ్యే ఖ‌ర్చులో 50 శాతం తెలంగాణ ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌న్న భారీ మాట‌ను చెప్పేశారు. ఇంత మాట అన్నాక‌.. మోడీ నోటి నుంచి మాట వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు.

ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ నోటి నుంచి వ‌చ్చిన 50 శాతం వాటాను పెట్టుకుంటామ‌న్న మాట‌ను.. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పేశారు. 11 రోజులుగా ఉక్కు దీక్ష పేరుతో టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ చేప‌ట్టిన దీక్ష ను తాజాగా విర‌మింప‌చేసిన చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ఢిల్లీలో మోడీని క‌లిసిన సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర  మంత్రి కేటీఆర్ ఏం చెప్పారో.. ఇంచుమించు అదే మాట‌ల్ని దీక్ష విర‌మ‌ణ సంద‌ర్భంగా చంద్ర‌బాబు చెప్ప‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. అనుభ‌వంలో బాబుకు మించినోళ్లు దేశంలోనే లేన‌ప్పుడు.. మొద‌టిసారి మంత్రి అయిన కేటీఆర్ మాట‌ల్ని బాబు ఫాలో కావ‌టం ఏమిటో..?
Tags:    

Similar News