బాబు మాట: హైద‌రాబాద్ నేను క‌ట్ట‌లేదు

Update: 2018-11-29 01:30 GMT
ఓవైపు సోష‌ల్ మీడియాలో సెటైర్ల జోరు..మ‌రోవైపు అప‌ద్ధ‌ర్మ స‌ర్కారుకు సార‌థ్యం వ‌హిస్తున్న టీఆర్ ఎస్ విమ‌ర్శ‌ల హోరు నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు టీడీపీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఇటు ఖ‌మ్మంలో అటు హైద‌రాబాద్‌ లో ప్ర‌సంగిస్తూ చంద్ర‌బాబు హైద‌రాబాదు నిర్మాణంపై క్లారిటీ ఇచ్చారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనను దూషిస్తున్నారని చంద్రబాబు వాపోయారు. ఇది న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. అసలు నేను ఏం తప్పు చేశాను? తెలంగాణ అభివృద్ధికి టీడీపీ సహకరించలేదా? తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉండేవారా? అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ కట్టింది నేనే అని ఏనాడు తాను చెప్పలేదని ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఖమ్మంలో ప్రజా కూటమి ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబు ప్రసంగించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ గాంధీతో కలిసి ఆయన వేదికను పంచుకున్నారు. హైదరాబాద్ కట్టింది నేనే అని తాను చెప్పుకుంటున్నట్టుగా టీఆర్ ఎస్ నేతలు చేసిన విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. సైబరాబాద్ - హైటెక్ సిటీ - ఎయిర్‌పోర్టులకు రూపకల్పన చేసింది నేనే అని మాత్రమే చెప్పానని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా హైదరాబాద్ - సైబరాబాద్‌ పై ప్రత్యేక శ్రధ్ద పెట్టానని - వాటి అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమించానని  చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ నగరం బంగారు గుడ్డు పెట్టే బాతులాంటిదని చంద్రబాబు అభివర్ణించారు. అలాంటి నగరం తెలంగాణకు ఉండటం గొప్ప వరం అన్నారు. ఇక్కడి యువతకు అవకాశం కల్పించి - ప్రోత్సాహం అందిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి వారికి ఉందన్నారు. భూమి కానీ - వాతావరణం కానీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని - ఇవన్నీ ఉపయోగించుకుంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అవుతుందని అన్నారు. కానీ టీఆర్ ఎస్ పాలనలో అలాంటిదేమీ జరగలేదన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయి పరిస్థితి దారుణంగా తయారైందని చంద్రబాబు వాపోయారు.

తాను తెలంగాణలో పోటీ చేయనని - ఏపీ సీఎంగానే ఉంటానని చంద్రబాబు అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దేశం కోసం - తెలుగు రాష్ట్రాల బాగు కోసం - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ తో చేతులు కలిపామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ - టీడీపీ కలయిక చారిత్రక అససరం అని చంద్రబాబు అన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం... అనేక అవకాశాలున్నాయి... బంగారు బాతులాంటి హైదరాబాద్ కూడా ఉంది... అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి తెలంగాణ యువతకు ఉంది... ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటే భారతదేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ ఉంటుంది... కానీ, నాలుగేళ్లలో చేసింది ఏమీ లేదు... కొన్ని సార్లు తలచుకుంటే బాధేస్తోందన్నారు చంద్రబాబు. ఇక టెక్నాలజీ పెరిగిపోయింది... టెలిఫోన్ ట్యాప్ చేయడం చాలా సులభం అని... ఈవీఎంల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని... ఓటు వేసే సమయంలో చెక్ చేసుకోవాలని సూచించారు.

   

Tags:    

Similar News