షాకింగ్: బాబును కూడా వినాయకుణ్ని చేశారు

Update: 2016-09-06 08:23 GMT
వినాయక చవితి పండగలన్నింట్లోకి చాలా ప్రత్యేకమైంది. ఆది దేవుడి పండుగను దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటారు. మండపాలు ఏర్పాటు చేయడం.. గణపయ్య విగ్రహం పెట్టడం.. నిమజ్జనం.. అన్నీ కూడా చాలా సందడిగా ఉంటాయి. ఐతే ఈ సంబరాలు గత కొన్నేళ్లలో కొత్త కొత్త మలుపులు తీసుకుంటూ జనాలకు వెర్రెత్తేలా చేస్తున్నాయి. వాళ్ల విగ్రహం 40 అడుగులుంటే.. మాది 50 అడుగులంటూ వేలం వెర్రి పోటీలు చూస్తూ వచ్చాం ఇన్నాళ్లూ. ఇప్పుడు గణపతిని చిత్ర విచిత్ర అవతారాల్లో తీర్చిదిద్దడంలో జనాల పైత్యం చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది.

బాహుబలి వినాయకుడని.. సర్దార్ గబ్బర్ సింగ్ వినాయకుడని.. ఇప్పటికే సినీ అభిమానుల పిచ్చిని చూశాం. తాజాగా ఈ పిచ్చి రాజకీయాభిమానులకు కూడా విస్తరించింది. ఏకంగా చంద్రబాబు వినాయకుడిని తయారు చేసే స్థాయికి వెర్రి పతాక స్థాయికి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని ఓచోట చంద్రబాబు విఘ్నావతారాన్ని తయారు చేసి మండపంలో కూర్చోబెట్టేశారు. మరోచోట మోడీ వినాయకుడు కూడా తయారయ్యాడు. ఇది పైత్యానికి పరాకాష్ట కాక మరేంటో? ముందు సినీ అభిమానుల నుంచి వచ్చిన పైత్యం.. ఇప్పుడు రాజకీయ నాయకుల్ని కూడా దేవుళ్లుగా తీర్చిదిద్దే వరకు వచ్చింది. ఈ ఏడాది ఓచోట గోన గన్నారెడ్డి వినాయకుడు కూడా తయారవడం విశేషం. అభిమానం పేరుతో దేవుళ్ల స్థాయిని దిగదార్చేలా.. భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసేలా సాగుతున్న ఈ పైత్యానికి అడ్డుకట్ట పడాల్సిన అవసరముంది.
Tags:    

Similar News