అనుష్కతో ఫ్యామిలీ ఫొటో.. గ్రౌండ్ లో భావోద్వేగం.. నితీశ్ నాన్న వైరల్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక మెల్ బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక మెల్ బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. మరీ ముఖ్యంగా ఈ సందర్భాన్ని అతడి తండి కాకి ముత్యాల రెడ్డి మైదానంలో ఉండి కళ్లారా వీక్షించారు. నితీశ్ ఒక్కో పరుగు చేస్తూ సెంచరీకి దగ్గర కావడం ముత్యాలరెడ్డిలో తీవ్ర ఒత్తిడి పెంచింది. 90ల్లోకి వచ్చాక ఒకటిరెండు సార్లు ఔటయ్యే ప్రమాదం తప్పడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖ నుంచి మెల్ బోర్న్ కు
నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ తోనే టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల్లోనూ ఆడాడు. అయితే, వీటికి అతడి కుటుంబ సభ్యులు రాలేదు. నాలుగో టెస్టు జరుగుతున్న మెల్ బోర్న్ కు మాత్రం కుటుంబం అంతా వచ్చారు. ముత్యాలరెడ్డి బంధువులు, సన్నిహితులు కూడా మైదానంలో కనిపించారు.
అనుష్కతో పిక్
ముత్యాలరెడ్డి భార్యతో కలిసి మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మతో ఫొటో దిగారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫొటోలోనే మరో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి కూడా ఉన్నారు. త్వరలో ఈమె బిడ్డకు జన్మనివ్వనున్నారు.
కాగా, ఈ ఘటన శుక్రవారమే జరిగినా.. ముత్యాలరెడ్డి శనివారం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. హార్ట్ సింబల్ తో లవ్లీ మూమెంట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అనుష్క డెనిమ్ తో పాటు క్యాజువల్ వైట్ టాప్ ధరించారు.