ప్ర‌తినెలా...హ‌డావుడి చేసేద్దామంటున్న బాబు

Update: 2017-12-24 05:58 GMT
సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు....ఫిన్‌టెక్...అగ్రిటెక్....ఎడ్యుకేషన్ ఈవెంట్లు ఇవ‌న్నీ ఇటీవ‌లి కాలంలో ఏపీలో త‌ర‌చుగా జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాలు, ఈవెంట్లు. వీటి వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఎంత‌? ఎన్ని ఒప్పందాలు జ‌రిగాయి? ఎన్ని ఉద్యోగాలు వ‌స్తున్నాయి అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే ఎదుర‌వుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ....ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని స‌ర్కారు ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఒక‌దాని వెంట మరొక‌టి చేసుకుంటూ పోతోంది. ఇక నుంచి ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ...ప్ర‌తినెలా ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించేలా చేద్దామ‌ని తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌తిపాదించ‌డం విశేషం.

ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ తో కలిసి సచివాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ)పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌జంగానే....హైద‌రాబాద్ గురించి త‌న అనుభ‌వాల‌ని మ‌రోమారు చెప్పేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి తాను తీసుకున్న చర్యలు - అనుభవాలను సమీక్షలో చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడానికి ఎన్నో ప్రయాసలు పడ్డానని, ఐటీ కంపెనీల ప్రతినిధులకు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చిన విషయాన్ని చంద్ర‌బాబు మ‌ళ్లీ గుర్తుచేశారు! ఐటీ గురించి అంతగా అవగాహన లేకున్నా సమాచారం సేకరించి అధ్యయనం చేశామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లో ఎప్పటికప్పుడు నూతనత్వం ఉండాలని అన్నారు.

కృత్రిమ మేధస్సు, రోబో టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని, వాటిని అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రూపొందించుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ అధికారులకు సూచించారు.  రాష్ట్రం ఐటీ, ఐవోటీకి ప్రాధాన్యత ఇస్తున్నందున అంతర్జాతీయ సంస్థలు మొగ్గుచూపే అవకాశం ఉందని చెప్పారు. ప్రతినెలా ఏదో ఒక సదస్సు నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ సంస్థలను ఆకట్టుకోవచ్చని చెప్పారు. అన్ని డిగ్రీ కోర్సుల్లోనూ ఐటీని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని సీఎం చంద్ర‌బాబు అధికారులకు సూచించారు. అగ్రికల్చర్ - మెడికల్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లోనూ ఐటీని తప్పనిసరి చేయాలని నిర్దేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ‘లీక్వాన్ యూనివర్సిటీ’ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈలు నెలకొల్పేందుకు యువతకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
Tags:    

Similar News