ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అడ్డుగోడ బాబేనట

Update: 2016-12-03 06:06 GMT
మంత్రులు - ఎమ్మెల్యేలపై తరచూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన బృందాన్ని నిత్యం తప్పుపడుతున్నారు. అయితే... మంత్రులు - ఎమ్మెల్యేలు - అధికారులు మాత్రం తామేమీ చేయలేకపోవడానికి కారణం చంద్రబాబేనని అంటున్నారు.  చంద్రబాబు చెప్పింది చేయడానికి తమకేమీ అభ్యంతరం లేదని.. కానీ, చెప్పింది చేయడానికి ఆయన టైమివ్వడం లేదని అసలు విషయం చెబుతున్నారు. నిత్యం సమావేశాలు - సమీక్షలు అంటూ గంటలుగంటలు ఆయనే సమయం తింటుంటే ఇంకా తమకు టైమెక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
    
రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో పాలన సజావుగా సాగటంలేదన్నది కాదనలేని సత్యం.  ప్రజలకు అందాల్సిన సేవలు మందగించాయి. మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలు - ప్రజా విశ్వాసాన్ని కోల్పోయేలా చేయటానికి సీఎం చర్యలే కారణంగా భావిస్తున్నారు. తాను రోజుకి 18 గంటలు కష్టపడతానని - రేయింబవళ్లూ ప్రజాక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్నానని చెప్పే సీఎం చంద్రబాబు అధికారులను, ప్రజాప్రతినిధులను పనిచేయకుండా చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు అటు అధికారులుగాని, ఇటు ప్రజాప్రతినిధులు గాని ఎవరూ అందుబాటులో లేని పరిస్థితి. అత్యవసర పనులు కూడా నిలిచిపోతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామస్థాయి కార్యాలయాల వరకూ ఎక్కడి ఫైళ్లు అక్కడే పెండింగ్ పడుతున్నాయి. అసలు అధికారులు - ప్రజాప్రతినిధులు ప్రజలను కలుసుకునే సమయమే లేకుండాపోతోంది. దీంతో ప్రజా వ్యతిరేకత - అసహనం రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.
    
దీనికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రేనంటున్నారు సాక్షాత్తు టీడీపీ నేతలు. ప్రజాప్రతినిధులు - అధికారులు ప్రజల మధ్యకు వెళ్లాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి కావాల్సిన అవసరాలను గుర్తించి వాటిని సకాలంలో తీర్చాల్సిన బాధ్యత అధికారులు - ప్రజాప్రతినిధులపై ఉంది కాని ఇవి చేయటానికి వారికి సమయం లేకుండా చేస్తున్నది ముఖ్యమంత్రేనంటున్నారు. ఉదయం లేచిన తర్వాత దాదాపు రెండు గంటలపాటు అధికారులు - ప్రజాప్రతినిధులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆ సమయమంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం వినాల్సిందే.  ఎవరితో మాట్లాడటం కాని, ఎవర్నీ కలవటం గానీ సాధ్యంకాదు. ఈలోగా మధ్యాహ్నం అవుతుంది. తర్వాత నియోజకవర్గంలోకి వెళ్లటానికి కాని, ప్రజలను కలవటానికి గాని ప్రజాప్రతినిధులకు వీలుకాని పరిస్థితి. ఈలోగా ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు హాజరవటం, ముఖ్యమంత్రి కార్యాలయంలో నిర్వహించే సమీక్షల్లో పాల్గొనటం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరువ కాలేకపోతున్నారు. వారి అవసరాలను గుర్తించలేకపోతున్నారు. దీంతో ప్రజలు, ప్రజాప్రతినిధులకు మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది.
    
మరోవైపు అధికారులదీ ఇదే పరిస్థితి. ఉదయం 2 గంటలపాటు టెలికాన్ఫరెన్స్ ఉండటంతో పనులు అన్నీ నిలిచిపోతున్నాయి. తర్వాత సీఎం నిర్వహించే సమీక్షలు - పాల్గొనే సభలు - సమావేశాల ఏర్పాట్లు చూడటంతోనే అధికారులకు పుణ్యకాలం పూర్తవుతుంది. కార్యాలయాల్లో ఉండే రోజువారీ వ్యవహారాలు, ఫైల్స్ క్లియరెన్స్ ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. దీంతో ప్రజావసరాలు తీరడంలేదు. ఫలితంగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు కూడా సీఎం తీరుపట్ల మండిపడుతున్నారు. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి.  కొందరైతే చంద్రబాబు ఏం మాట్లాడుతారో అక్షరం పొల్లుపోకుండా మొత్తం ముందే చెప్పేస్తున్నారు... ఇదెలా సాధ్యం అంటే, రెండేళ్లుగా వింటున్న ప్రసంగమే కదా, కంఠతా వచ్చేసింది అని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News