బాబుకు కిరికిరే : మరో కేసు రెడీ అవుతోందా?

Update: 2016-09-01 04:26 GMT
చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ పడబోతున్నదా? ఒక్కొక్కటిగా ఆయనకు ప్రతికూల పరిణామాలు ఎదురవబోతున్నాయా? ఇప్పటికే ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ ఏర్పాటు చేయబోయే ప్రత్యేక విచారణ బృందం విచారణను ఎదుర్కోవలసిన పరిస్థితుల్లో పడిపోయిన చంద్రబాబు - ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న ఉండవిల్లిలోని భవంతి నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు వస్తాయా? అంటే అవుననే న్యాయనిపుణులు అంటున్నారు. అక్రమ నిర్మాణంలో - అక్రమమైన పద్ధతుల్లో - ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమైన ప్రెవేటు భవంతిలో ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా మార్చుకుని నివసించడం చట్ట విరుద్ధం అంటూ ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసులో కూడా త్వరలోనే తీర్పు వస్తుందని - ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు అన్నీ పక్కాగా, స్పష్టంగా ఉన్నందున చంద్రబాబు ఆ ఇంటినుంచి బయటకు రాక తప్పదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.

ఓటుకు నోటుకేసు గురించి ఏసీబీ కోర్టులో తాజాగా కేసు వేసి, చంద్రబాబును విచారించడానికి ఉత్తర్వులు రావడానికి కారకుడైన వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డే.. చంద్రబాబు నివాసంలో అక్రమాలకు సంబంధించిన ఈ కేసు కూడా వేశారు. అసలు ఆ భవంతి అక్రమ నిర్మాణం అని, కృష్ణ నది కరకట్టపై నిర్మించారని, అక్రమ ఒప్పందం ద్వారా చంద్రబాబు దానిని సీఎం నివాసంగా మార్చారని ఆరోపిస్తున్నారు.

ఈ విషయంలో పక్కా ఆధారాలతో కోర్టులో ఇప్పటికే కేసు నడుస్తున్నదని.. త్వరలోనే తీర్పు వస్తుందని ఆయన అంటున్నారు. ఒకవైపు హోదా విషయంలో చంద్రబాబు చేతగానితనం బయటపడిపోయేలా పవన్‌ కల్యాణ్‌ నుంచి తాకిడి, మరోవైపు ఓటుకు నోటు కేసు తిరిగి పట్టాల మీదికి రావడం, విచారణను ఎదర్కోవాల్సిన పరిస్థితి, ఇప్పుడు నివాసం ఉన్న ఇంటినుంచి కూడా గెటౌట్‌ కావాల్సిన పరిస్థితి.. ఇవన్నీ గమనిస్తోంటే... చంద్రబాబుకు బ్యాడ్‌ టైం స్టార్ట్‌ అయిందేమో అని జనం అనుకుంటున్నారు.

Tags:    

Similar News