నేతలే లేరంటే గ్రూపులు కూడానా బాబూ... !

Update: 2017-10-09 04:31 GMT
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇటీవలి ప్రెస్ మీట్ లో ఏకంగా.. తెలంగాణలో అసలు తెలుగుదేశం ఎక్కడుంది. ఇక్కడ ఆ పార్టీ లేనే లేదు... అని తేల్చి పారేశారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం నాడు హైదరాబాదులో టీటీడీపీ కీలక నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీకి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. చాలాకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న దేవేందర్ గౌడ్ వంటి నాయకులు కూడా ఈ సమావేశానికి రావడం విశేషం. అయితే ఈ సమావేశంలో  చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యల మీద మాత్రం తెలంగాణ పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణలో పార్టీ కార్యకర్తల గ్రూపు విబేదాల్ని పక్కన బెట్టి కలిసి మెలిసి పనిచేసుకోవాలని తగాదాలు లేకుండా పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావాలని చంద్రబాబునాయుడు అన్నారు. అసలిక్కడ పార్టీకి కార్యకర్తలే లేరు మొర్రో అని నాయకులు మొత్తుకుంటూ ఉంటే.. మళ్లీ నాయకుల మధ్య గ్రూపు తగాదాలు కూడా ఎక్కడినుంచి వచ్చాయి బాబూ.. అని కేడర్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఏదో ఏపీలో పార్టీ సమావేశంలో మాట్లాడినట్లుగా మూస స్పీచ్ ను ఇక్కడ కూడా వల్లించినట్లుగా ఉన్నారని.. ఇక్కడ గ్రూపులు కట్టేంత నాయకులు కూడా లేరని, అధికారంలో లేని పార్టీకి, అసలే కష్టాల్లో ఉన్న పార్టీలో గ్రూపులకు  కూడా విలువ ఉండదనే సంగతి కూడా అందరికీ తెలుసునని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే పొత్తుల గురించి ఎవ్వరూ మాట్లాడవద్దంటూ చంద్రబాబు హెచ్చరికలు చేయడం కూడా గమనించాలి. ఎందుకంటే.. ఇటీవల తెరాస పొత్తు పెట్టుకోవచ్చునని మోత్కుపల్లి నరసింహులు అనడం, అదే సమయంలో.. తెరాసను ఓడించడానికి ప్రతిపక్షాలు అందరూ కలసికట్టుగా ఉంటే బాగుంటుందని సింగరేణి ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఇలాంటివి వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో పొత్తుల సంగతి ఎన్నికల సమయంలోనే తేలుతుందంటూ చంద్రబాబునాయుడు చెప్పడం.. పార్టీలో కార్యకర్తలను మరింత గందరగోళానికి గురిచేస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు భాజపా వారికి అధికారికంగా మిత్రపక్షమే.. లోకల్ గా వారి మధ్య మైత్రి ఎలా ఉన్నా.. రికార్డుల ప్రకారం కలిసి ఉన్నట్లే లెక్క. అయితే పొత్తుల సంగతి ఎన్నికల సమయంలో తేల్చదాం అని అధినేత అంటున్నారంటే.. భాజపాతో మైత్రి విషయం కూడా డౌటుగా మారినట్లేనా అని పలువురు భావిస్తున్నారు.
Tags:    

Similar News