బాబుతో రహస్య మిత్రుల భేటి!.. వాట్ నెక్ట్స్?

Update: 2019-01-29 05:20 GMT
ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు గెలుపుపై అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్నికల ముందర ఎన్ని తాయిలాలు ప్రకటించినా ప్రజల ఆదరాభిమానాలు దక్కుతాయా లేవా అన్న టెన్షన్ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును సేవ్ చేయడానికి ఇద్దరు రహస్య మిత్రులు రంగంలోకి దిగారు. నిన్న రాత్రి సీక్రెట్ గా చంద్రబాబును కలుసుకొని మంతనాలు జరిపారు. వారు ఏం మాట్లాడుకున్నారు.. బాబుకు ఏం సలహా ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది.

బాబును కలిసిన వారు ఆషామాషీ వ్యక్తులు కాదు.. అందులో ఒకరు ఆంధ్రా అక్టోపస్.. సర్వేలతో ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించే లగడపాటి రాజగోపాల్. రాజకీయాల నుంచి వైదొలిగి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న లగడపాటి తెలంగాణ ఎన్నికల వేళ విడుదల చేసిన సర్వేలతో అభాసుపాలయ్యారు. ఎవరి ప్రోద్బలంతోనే లగడపాటి తప్పుడు సర్వేలు విడుదల చేసి తన విశ్వసనీయత పోగొట్టుకున్నారని విమర్శలు వచ్చాయి.. కానీ ఇదివరకు లగడపాటి విడుదల చేసిన సర్వేలన్నీ నిజమైనవే..రాజకీయాలను ఆవపోసన పట్టే లగడపాటి నిన్న రాత్రి బాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది..

ఇక బాబును లగడపాటితో కలిసి ఒకే కారులో ఆంధ్రజ్యోతి ఏబీఎన్  ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా వచ్చి కలవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. బాబు కోటరీలో కీలక వ్యక్తిగా.. మీడియా సపోర్టర్ గా ఉన్న రాధాకృష్ణ.. లగడపాటితో కలిసి చంద్రబాబును అమరావతిలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాబుకు రాబోయే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి.? ఎక్కడ ఓడిపోయే అవకాశాలున్నాయి. ఎలా చేస్తే గెలుస్తారనేది దానిపై చర్చ జరిగి ఉంటుందని అమరావతి వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఏదీ ఏమైనా చంద్రబాబు పుట్టి మునిగే సమయంలో ఇద్దరు అజాత శత్రువులు సీక్రెట్ గా బాబుతో మంతనాలు జరపడం.. ఆయన్ను కాపాడేందుకు రంగంలోకి దిగడం ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచింది.
   

Tags:    

Similar News