బాబు మళ్లీ బుక్ అయ్యారా?

Update: 2017-02-01 04:44 GMT
గంగాళం పాలు ఉన్నా.. ఒక్క విషపు చుక్క చాలు. మొత్తం పాలు విరిగిపోవటానికి. పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడే క్రమంలో సరైన ఎంపిక లేకుండా చేసే హడావుడికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈపాటికి అర్థమై ఉండాలి. ఆర్భాటంగా చేసే కార్యక్రమాల్లో ఎందుకంత హడావుడో కానీ.. సరైన క్రాస్ చెక్ లేకుండా చేసే పనుల కారణంగా చంద్రబాబు పేరు ప్రఖ్యాతులు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది.

సాక్షి పత్రికలో ఈ రోజు ప్రచురించిన ఒక కథనం ఆసక్తికరంగా ఉండటమే కాదు.. బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉండటం గమనార్హం. విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రూ.10లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనను ఒక నవ్వులాటగా.. అదో కామెడీ వ్యవహారంగా చెప్పే పక్కా ఉదాహరణను తెర మీదకు తీసుకొచ్చింది. ఈకథనాన్ని చదివిన వారు ఎవరైనా.. బాబు చెప్పిన రూ.10లక్షల కోట్ల పెట్టుబడుల్ని పెద్ద ఫార్సుగా భావించే అవకాశం చాలా ఎక్కువని చెప్పక తప్పదు.

విశాఖ సదస్సులో ఏపీ సర్కారుతో వ్యాపార ఒప్పందాలు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఎంవోయి కాపీల్ని అందజేశారు. అలా అందుకున్న వారిలో ఒకరు ఫోటోలో ఉన్న వ్యక్తి. ఈయన పారిశ్రామికవేత్తగా ఫోకస్ చేసినప్పటికీ.. ఆయన గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన దొడ్డాల సుధీర్ అని తేల్చారు.

ఫోటోలు ఉన్న పాత పెంకుటిల్లు ఆయన ఉండే ఇల్లు అని.. ఏపీ సర్కారుతో ఎంవోయి కుదర్చుకున్న పారిశ్రామికవేత్తగా చెప్పినప్పటికీ.. సుధీర్ ఫ్లాట్ల ఏజెంట్ గా పని చేస్తున్నారని వెల్లడించింది. గతంలో సుధీర్..ఈవీఎం కాలేజీలో పీఆర్వోగా పని చేస్తూ.. ఇంటర్.. ఇంజనీరింగ్ విద్యార్థుల్ని కాలేజీల్లో చేర్పించి కమీషన్లు తీసుకునే వారని..   రెండేళ్ల కిందట కోటప్పకొండ సమీపంలో విరంచి టౌన్ షిప్స్ ప్రైవేటు కంపెనీలో సుధీర్ ప్లాట్లు విక్రయించే ఏజెంట్ గా చేరినట్లుగా చెబుతున్నారు.

కమీషన్ల ఆధారంగా జీవించే సుధీర్ ను కోట్లు పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తగా ఒప్పందాల మీద సంతకాలు చేయటంపై విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ ఉదంతంలో వాస్తవం ఎంతన్నది ఏపీ సర్కారు వివరణ ఇస్తే కానీ తేలదు. తేలు కుట్టిన దొంగల ఉండిపోతే మాత్రం.. జనం దృష్టో బాబు మరింత పలుచన కావటమే కాదు.. ఆయన చెప్పే విషయాల్ని ప్రజలు నమ్మే అవకాశం ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. మరి.. సుధీర్ విషయంలో ఏపీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News