యూపీలో ప్ర‌తిప‌క్ష పార్టీల త‌ప్పు.. బాబు అలా చేయ‌రంటా!

Update: 2022-03-13 23:30 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీకి వ్య‌తిరేకంగా ఎన్నో అంచ‌నాలు, అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ ఎన్నిక‌ల్లో విజ‌యంతో ఆ పార్టీ వ‌రుస‌గా రెండో సారి ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పోలిస్తే సీట్ల సంఖ్య త‌గ్గినా.. అది బీజేపీకి ఎలాంటి ఇబ్బంది క‌లిగించ‌లేదు.

అయితే యూపీలో బీజేపీ వ్య‌తిరేక ఓట్లు చీల‌డం ఆ పార్టీకి క‌లిసొచ్చింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బహుజ‌న్ స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తి, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ అక్క‌డ బీజేపీ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చ‌డం వ‌ల్ల స‌మాజ్‌వాదీ పార్టీకి దెబ్బ త‌గిలింద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. అది బీజేపీకి లాభాన్ని చేకూర్చుంది.

ఇప్పుడు ఏపీ విష‌యానికి వ‌స్తే అధికార జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌నే టాక్ ఉంది. అది ఎంత‌వ‌ర‌కూ ఉంద‌న్న‌ది మాత్రం ఇంకా తెలీదు. అయితే యూపీలో మాదిరే వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు ఏపీలోనూ వైసీపీపై వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంచ‌నా వేస్తున్నారు.

 కానీ యూపీలో ప్ర‌తిప‌క్షాలు చేసిన త‌ప్పు ఇక్క‌డ చేయ‌కుండా బాబు జాగ్ర‌త్త‌గా ముందుకు సాగాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిసింది. వైసీసీ వ్య‌తిరేక ఓట్లు చీల్చ‌కుండా చూసేందుకు బాబు సిద్ధ‌మ‌వుతున్నారు. అందుకు అవ‌స‌ర‌మైతే బీజేపీని కూడా క‌లుపుకొని పోవాల‌ని చూస్తున్నార‌ని స‌మాచారం.

ఏపీలో వైసీపీకి వ్య‌తిరేకంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఉంది. మ‌రోవైపు జ‌న‌సేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. కానీ బీజేపీతో జ‌న‌సేన బంధాన్ని తెంచుకోవాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి సాగేందుకు బాబు ఆరాట‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన, కమ్యూనిస్టుల‌తో పాటు క‌లిసి సాగితే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలే అవ‌కాశం ఉండ‌ద‌ని బాబు భావిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు బీజేపీని కూడా క‌లుపుకొని పోతే అధిక ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని అనుకుంటున్నార‌ని తెలిసింది.

 అంతే కాకుండా జ‌గ‌న్ ఓటు బ్యాంకును చీల్చేందుకు బాబు క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్‌కు అండ‌గా ఉన్న ద‌ళిత‌, రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను ఆక‌ర్షించేందుకు ఆ సామాజిక‌వ‌ర్గాల నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు బాబు ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టిన‌ట్లు టాక్‌.   

Tags:    

Similar News