బాబు టార్గెట్ ‘‘రూ.7 లక్షల కోట్లు’’..?

Update: 2016-10-23 05:08 GMT
మీరు చదివింది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం ఇప్పుడు రూ.7 లక్షల కోట్లుగా ఉంది. ఆ విషయాన్ని ఆయనే తాజాగా వెల్లడించారు. కాకుంటే.. మీరు అనుకునే దానికి చంద్రబాబు చెప్పిన దానికి ఏ మాత్రం సంబంధం లేదనే చెప్పాలి. ఈ ఏడాది జనవరిలో విశాఖపట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.4.70లక్షల కోట్ల పెట్టుబడుల్ని బాబు సర్కారు ఆకర్షించింది. మరో రెండు నెలల వ్యవధిలో మరో భారీ సదస్సును వచ్చే జనవరిలో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలన్న సంకల్పంతో ఏపీ సర్కారు పయనిస్తోంది. ఈ ఏడాదితో పోలిస్తే.. వచ్చే ఏడాది రెట్టింపుస్థాయిలో పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నది చంద్రబాబు లక్ష్యంగా చెప్పొచ్చు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఈసారి గృహ నిర్మాణానికి సంబంధించిన జాతీయ.. అంతర్జాతీయ కంపెనీల్ని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు అంటే కేవలం పరిశ్రమల శాఖకు సంబంధించిన అంశంగా మాత్రమే పరిగణించకూడదని.. అన్ని శాఖలకు సదస్సులో భాగస్వామ్యం కలిగేలా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్నీ పెట్టుబడుల కోసం భారీగా కసరత్తు చేస్తే పెద్ద ఎత్తున నిధులురావటం కష్టం కాదన్న మాట వినిపిస్తోంది.

ఇప్పటికే ఉన్న ప్రభుత్వశాఖలకు.. వాటి సంబంధిత రంగాలకు చెందిన పరిశ్రమల్ని సంప్రదించటం.. వారితో ఏపీలో పెట్టుబడులు పెట్టించే అంశంపై చర్చించటంతో పాటు.. ఏపీలో వారికున్న వ్యాపార అవకాశాల గురించి వివరించటం ద్వారా.. పెట్టుబడులు పెట్టించాలని బాబు భావిస్తున్నారు. వ్యవసాయ రంగ యంత్ర పరికరాల తయారీ అంశాన్ని వ్యవసాయ శాఖ.. పర్యాటక అభివృద్ధి సంస్థల్ని అకర్షించే బాధ్యతల్ని సదరు శాఖ చూసేలా బాబు వ్యూహం రచించారు. దీంతో.. పరిశ్రమల శాఖకు.. మిగిలిన శాఖలన్నీ అనుసంధానం కావటంతో పాటు.. ఎవరికి వారుగా పెట్టుబడులు తెచ్చే ప్రయత్నాలు పెరగటంతో.. పెట్టుబడులుకూడా భారీగా  వచ్చే వీలుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే సదస్సుకు రూ.7లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఏపీలో పెట్టించేందుకు ప్రయత్నించొద్దన్న భావన వ్యక్తమవుతోంది. తన మాటలతో అధికారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నా.. చేతల్లో అదెంత వరకూ పూర్తి అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News