అద్భుతాలు స‌రే.. మ‌న‌ది అప్పుల రాష్ట్రం బాబు

Update: 2017-10-26 05:13 GMT
మింగ మెతుకు లేదు కానీ మీసాల‌కు సంపెంగ‌నూనె అన్న‌ట్లుగా ఉంది ఏపీ సీఎం చంద్ర‌బాబుగారి య‌వ్వారం చూస్తుంటే. నెలస‌రి జీతాలు ఇచ్చేందుకే క‌ట‌క‌ట‌లాడే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితితో పాటు.. ఎప్ప‌టిక‌ప్పుడు అందినంత అప్పులు చేసేసి స‌ర్కారు బండి లాగిస్తున్న ఏపీ స‌ర్కారు.. ఇప్పుడు రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణ ఖ‌ర్చును నెత్తిన వేసుకోవ‌టం తెలిసిందే.

ఇష్టం లేని విభ‌జ‌న‌ను ఓకే చేయాల్సి వ‌చ్చిన ఆంధ్రోళ్ల‌కు.. ఇప్పుడు రాజ‌ధాని ఖ‌ర్చు భారం పెద్ద గుదిబండ‌లా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రాజ‌ధాని న‌గ‌రం లేకుండా విభ‌జ‌న చేసిన వేళ‌.. న‌గ‌ర నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చులో కేంద్రం వాటా ఎంత‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం తెలిసిందే. ఢిల్లీని త‌ల‌ద‌న్నేలా రాజ‌ధానిని నిర్మిద్దామ‌ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ మోడీ చెప్పిన‌ప్ప‌టికీ.. ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న త‌ర్వాత ఆయ‌న ఆ విష‌యాన్ని పూర్తిగా మ‌ర్చిపోయారు.

ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం అద్భుతం.. అద్భుతం అంటూ నిర్మాణ వ్య‌యం గురించి ప‌ట్టించుకోకుండా అదిరిపోయేలా భ‌వ‌న న‌మూనాలు ఉండాల‌ని చెబుతున్నారు. పై షోకుల కంటే కూడా ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచాల్సిన బాధ్య‌త‌ను బాబు విస్మ‌రిస్తున్న‌ట్లుగా ఉంది. ప్ర‌పంచంలోని ఐదు అత్యుత్త‌మ న‌గ‌రాల్లో ఒక‌టిగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌రం ఉండాల‌న్న ఆకాంక్ష వినేట‌ప్పుడు బాగానే ఉన్నా.. ఆ క‌ల‌ను నెర‌వేర్చే బాధ్య‌త‌ను ఆంధ్రోళ్లు మొత్తం భ‌రించాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

మిగిలిన రాష్ట్రం మొత్తం స‌రైన మౌలిక స‌దుపాయాలు లేక‌.. ఆరోగ్య వ‌స‌తులు లేక అల్లాడిపోతుంటే.. అమ‌రావ‌తి న‌గ‌రం మాత్రం బ్యూటీ పార్ల‌ర్ నుంచి మేక‌ప్ వేసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చిన అమ్మాయి మాదిరి ఉండాల‌ని ఆశించ‌టం ఎబ్బెట్టుగా ఉండ‌టం ఖాయం.

క‌ల‌లు ఎన్నైనా ఉండొచ్చు. కానీ.. ఏ ద‌శ‌లోనూ వాస్త‌వాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మ‌న స్థాయి ఏమిటి? మ‌న అవ‌స‌రాలు ఏమిటి? అన్న‌ది వ‌దిలేసి.. డాబు కోసం ప్ర‌య‌త్నిస్తే అస‌లుకే ఎస‌రు రావ‌టం ఖాయం. మూడున్న‌రేళ్ల బాబు పాల‌న‌లో ఏపీ రాష్ట్ర అప్పు ఎంత‌గా పెరిగిందో తెలిసిందే. స‌మ‌ర్థుడైన పాల‌కుడంటే ప‌న్ను పోటు త‌గ్గించి.. అప్పు భారాన్ని క‌నిష్ఠం చేయ‌టంలోనే ఉంటుంది. అది వ‌దిలేసి.. అద్భుతమైన క‌ట్ట‌డాల నిర్మాణమే లక్ష్యంగా.. ఖ‌ర్చు గురించి ప‌ట్టించుకోని త‌త్త్వం ఆంధ్రోళ్ల మీద అంతులేని భారాన్ని మోపుతుంద‌న్న విష‌యాన్ని గుర్తించుకుంటే మంచిది. లేకుంటే ఇప్ప‌టి త‌ర‌మే కాదు.. రాబోయే మ‌రికొన్ని త‌రాలు కూడా బాబు క‌ల‌ల భారాన్ని మోయాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇప్పుడు చెప్పండి.. అద్భుత‌మైన ఆకృతులు ఏపీ రాజ‌ధానికి అవ‌స‌ర‌మంటారా?
Tags:    

Similar News